న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, అయితే ఐసీయూ సేవలు అవసరమని ఆయన ప్రకటించారు.
‘జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలతో, తమిళనాడు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపాం. జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాం. ఆదివారం ఆమెకు గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఐసీయూ సేవలు అవసరం. జయలలిత చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎయిమ్స్ వైద్యులు చెన్నైకు వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది నిర్ణయిస్తాం’ అని జేపీ నడ్డా చెప్పారు.