
సాక్షి,సిటీబ్యూరో: శరత్ దంపతులు తమ చిన్నారితో కలిసి వాహనంపై వెళ్తున్నారు. పాప తల్లి ఒడిలో నిద్రపోతోంది. ఇంతలో పక్కనే ఓ పెద్ద శబ్దం.. పాప ఉలిక్కిపడి లేచింది. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. రఘువీర్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఆయనకు అసలే గుండె జబ్బు. తన పక్కనే టప్, టప్‌మని పెద్ద శబ్దాలు వినిపించాయి.. గుండె ఆగినంత పనైంది. ఏమైందోనని ఆందోళనగా చుట్టూ చూస్తే.. భారీ శబ్దాలు బుల్లెట్ వాహనాలవని తేలింది. ఈ రెండు సంఘటనలు నగరంలో ట్రాఫిక్ రద్దీలో ద్విచక్ర వాహనాలు, కార్ల హారన్ల మోతతో జనం పడుతున్న ఇబ్బందులకు ఉదాహరణలు. ప్రశాంతంగా వెళ్తున్న రహదారుల మీద తమ ద్విచక్రవాహనాలకు అమర్చిన మోడిఫైడ్ హారన్లతో ఒక్కసారిగా కుర్రకారుపెద్దపెద్ద శబ్దాలు చేస్తూ శబ్దకాలుష్యం సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో బుల్లెట్ సహా 200 సీసీ ఆపై ఇంజిన్ సామర్థ్యం గల భారీ బైక్‌లకు మోడిఫైడ్ హారన్లను, సైలెన్సర్లను అమర్చుకోవడం కుర్రకారుకు ఫ్యాషనైపోయింది. మరికొందరు పూర్తిగా సైలెన్సర్లనే తీసేసి రద్దీ రోడ్లపై వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆయా వాహనాల నుంచి వచ్చే ఈ శబ్దాలకు చిన్నారులు, మహిళలు, వృద్ధులతో పాటు రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు సైతం బెంబేలెత్తుతున్నారు. ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. యువత సరదా కోసం చేస్తున్న ఈ పని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ రవాణాశాఖ, ట్రాఫిక్ విభాగాలు అలాంటి వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు. ముఖ్య కూడళ్ల మీద నుంచి ఇలాంటి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్న వాహనాల నుంచి వెలువడుతున్న శబ్దాలను కొలిచేందుకు చేతిలో ఇమిడే సౌండ్ రీడర్లు కూడా ఆయా విభాగాల సిబ్బంద్ది వద్ద అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఎటు చూసినా విపరీత శబ్దాలే..
ప్రస్తుతం యువత ఎక్కువగా బుల్లెట్, అపాచీ, కేటీఎం వంటి బైక్స్‌ను అధికంగా ఇష్టపడుతున్నారు. ఆ వాహనాలు కొన్నాక వాటికి అదనపు హంగులు అమరస్తున్నారు. రంగు, హ్యాండిల్, హారన్ వంటి వాటి ఏర్పాట్ల కోసం కనీసం రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. వాహనాలకు కొత్త రకం శబ్దాలను వెలువరించే హారన్లను పెట్టిస్తున్నారు. ఇంకొందరు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను కూడా బిగిస్తున్నారు. పీసీబీ నిబంధనల ప్రకారం 55 డెసిబుల్స్‌ను మించి వెలువడే శబ్దాలు మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. కానీ మోడిఫైడ్ హారన్లతో 90 డెసిబుల్స్ కంటే అధికంగా విపరీత శబ్దాలు నగరంపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ఇతర వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు, చిన్నారులు, వృద్దులు, రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాహనాలను వేగంగా నడుపుతూ ఒక్కసారిగా ఆన్‌ఆఫ్ స్విచ్‌ను ఆఫ్ చేసి ఆన్ చేస్తే అతి పెద్ద శబ్దం వెలువడుతుంది. ఇలా ఎన్నిసార్లు ఆన్‌ఆఫ్ చేస్తే అన్నిసార్లు చప్పుళ్లు వస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు.
చోద్యం చూస్తున్న యంత్రాంగం..
నగరంలోని ప్రతి రహదారిపైనా ఇలాంటి విపరీత శబ్దాలు నిత్యకృత్యయ్యాయి. ఈ శబ్దాలు విన్న సమయంలో ఏమరుపాటుగా ఉన్నవారు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఇలాంటి విపరీత పోకడలకు కారణమవుతున్న వాహన చోదకులను నియంత్రించే విషయంలో ఇటు ఆర్టీఏ, అటు ట్రాఫిక్ విభాగాలు చోద్యం చూస్తున్నాయని నగరవాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విపరీత శబ్దాలతో ఇతర వాహనదారుల ఏకాగ్రత చెదిరి ఏం జరిగిందో అనే కంగారులో వాహనాన్ని ఆపినా, ఒక్కసారిగా వేగం తగ్గించినా, వెనుక పెద్ద వాహనం వస్తుందని ఒకేసారి పక్కకు జరిగినా ప్రమాదాలు జరుగుతున్నాయి.
గ్రేటర్ గూబ గుయ్‌మంటోంది..
పరిమితికి మించి వెలువడుతోన్న ధ్వనులతో గ్రేటర్ గూబ గుయ్‌మంటోంది. మహానగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలున్న సున్నిత ప్రాంతాల్లోనూ శబ్దకాలుష్యం మోతమోగుతోంది. నగరంలోని పలు సున్నిత ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ నిర్దేశించిన ప్రమాణాలకంటే అధిక ధ్వని కాలుష్యం వెలువడుతోంది. నగరంలో అబిడ్స్, పంజగుట్ట(వాణిజ్య ప్రాంతాలు), జీడిమెట్ల(పారిశ్రామిక ప్రాంతం), జూపార్కు(నిశ్శబ్ద జోన్), గచ్చిబౌలి, జూబ్లీహిల్స్(నివాస ప్రాంతం)లో మాత్రమే పీసీబీ ధ్వని కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు.. మరో వంద ముఖ్య కూడళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు అధికంగా ఉన్న మార్గాల్లో శబ్దకాలుష్య అవధిని నిర్ణయించడంలో పీసీబీ, మున్సిపల్, రవాణా, ట్రాఫిక్ విభాగాలు విఫలమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రణగొణ ధ్వనులతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
గ్రేటర్‌లో శబ్ద కాలుష్యానికి కారణాలివే..
♦ అధిక ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలకు విపరీత శబ్దాలు వెలువడే మోడిఫైడ్ హారన్లు, సైలెన్సర్ల వినియోగం
♦ రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్‌క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజే హోరు తదితర కారణాలతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది
♦ ప్రధానంగా భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా రేయింబవళ్లు హారన్ల మోత మోగిస్తుండడంతో సిటీజన్లు ఆందోళనకు గురవుతున్నారు.
♦ గ్రేటర్‌లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు.. వీటిలో 15 ఏళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు 15 లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి.
♦ గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 100 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. వీటి వద్ద అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మానసిక ఆందోళనకు కారణమవుతోంది.
♦ నివాస ప్రాంతాలను ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పబ్బుల ఏర్పాటుతో వీటి వద్ద డీజేల హోరు చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా మారింది
శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం
గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవే టు ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేవు. దీంతో రోగులు అధిక ధ్వనులు విని గగుర్పాటుకు గురవుతున్నారు. మహానగరం పరిధిలోని సుమారు ఐదువేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ శబ్ద గ్రాహకాలున్నవి అతితక్కువగా ఉన్నాయి.
శబ్ద కాలుష్యంతో నష్టాలివే..
♦ వినికిడి అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్దం అవధి మించి నమోదయితే అక్కడి నివాసితులకు వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిద్రలేమి, అలసట, హృæదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి.
♦ రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పనిపై ఆసక్తి కోల్పోతారు.
♦ నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
♦ 90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదముంది. చిన్నపిల్లల కర్ణభేరిలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి.
♦ పెంపుడు జంతువులు 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయి.
నగరంలో నమోదవుతోన్న శబ్ద కాలుష్యం (పగలు/రాత్రి) ఇలా ఉంది..
నివాసప్రాంతం 55 డెసిబుల్స్ దాటరాదు..
ప్రాంతం శబ్ద కాలుష్యం
జూబ్లీహిల్స్ 61/57
తార్నాక 55/45
వాణిజ్యప్రాంతంలో పగలు 65, రాత్రి 55 డెసిబుల్స్ మించరాదు.
జేఎన్‌టీయూ 70/67
ప్యారడైజ్ 68/68
సున్నితప్రాంతాల్లో పగలు 50, రాత్రి 45 డెసిబుల్స్ మించరాదు
జూపార్కు 60/50
గచ్చిబౌలి 61/55
Comments
Please login to add a commentAdd a comment