పలకరించిన తొలకరి
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
- విస్తారంగా కురుస్తున్న వర్షాలు
- నేడు, గురువారం భారీ వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వచ్చిన తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వివరాలు వెల్లడించారు. రుతుపవనాల కారణంగా మంగళ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. బుధవారం మాత్రం మోస్తరు వానలు పడతాయని ప్రకటించారు. వరుసగా రెండు రోజులపాటు 60% భూభాగంలో 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదైతే రుతుపవనాలు ప్రవేశించినట్లుగా నిర్ధారిస్తారని.. ఆ మేరకు శని, ఆదివారాల్లో తెలంగాణలో వర్షపాతం నమోదైందని వెల్లడించారు. మరోవైపు రుతుపవనాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి.
కొంత ఆలస్యంగా..
ఈసారి వాతావరణశాఖ అంచనా వేసిన మేరకు నైరుతి రుతుపవనాలు గత నెల 30వ తేదీనే కేరళలోకి ప్రవేశించాయి. అయితే ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసినా.. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం అడ్డుపడటం, ఇతర వాతావరణ మార్పుల కారణంగా ఆలస్యమై 12వ తేదీన ప్రవేశించాయి. 50 ఏళ్ల సరాసరి లెక్కల ప్రకారం నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి జూన్ 10న ప్రవేశించాలి. ఈ లెక్కన చూసినా కాస్త ఆలస్యంగా రాష్ట్రానికి చేరుకున్నాయి. గతేడాది 8వ తేదీన కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. 18వ తేదీన తెలంగాణలోకి 18వ తేదీన ప్రవేశించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణకు ఆరు రోజులు ముందుగానే ప్రవేశించినట్లు విశ్లేషిస్తున్నారు.
తగ్గిన ఉష్ణోగ్రతలు..
రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. సోమవారం హన్మకొండలో సాధారణం కంటే 9 డిగ్రీలు తక్కువగా 28 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. నిజామాబాద్‌లో సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా 31 డిగ్రీలు, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా 36 డిగ్రీలు, మెదక్‌లో 4 డిగ్రీలు తక్కువగా 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
విస్తారంగా వర్షాలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా చంద్రుగొండలో 6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నల్లబెల్లి, రంజాల్, రుద్రూర్, పాల్వంచలలో 5, భువనగిరి, కోటగిరి, కొత్తగూడెం, హసన్‌పర్తి, బూర్గుంపాడు, వర్నిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు గత 12 రోజుల్లో రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురిశాయి. ఈ 12 రోజుల సమయంలో తెలంగాణలో సాధారణ సగటు వర్షపాతం 35.1 మిల్లీమీటర్లుకాగా.. అంతకు రెట్టింపుగా 70.6 మిల్లీమీటర్లు కురవడం విశేషం. ఇక రుతుపవనాల రాకతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే దుక్కులు దున్నిన అన్నదాతలు తాజా వర్షాలతో విత్తనాలు చల్లేందుకు సిద్ధమయ్యారు. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు మరింత ఊపందుకుంటాయని.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని చెప్పారు.
జూన్ 1–12 మధ్య సాధారణ, నమోదైన వర్షపాతం
(పాత జిల్లాల ప్రకారం.. మిల్లీమీటర్లలో)
జిల్లా సాధారణం కురిసింది
ఆదిలాబాద్ 36.0 90.4
హైదరాబాద్ 28.5 11.4
కరీంనగర్ 37.0 80.0
ఖమ్మం 34.7 98.6
మహబూబ్‌నగర్ 32.1 56.1
మెదక్ 36.0 47.8
నల్లగొండ 32.6 72.3
నిజామాబాద్ 41.1 56.8
రంగారెడ్డి 32.1 68.3
వరంగల్ 37.4 47.8