* కొత్త ఎస్పీగా షానవాజ్‌ఖాసిం
* ఏరికోరి ఎంపిక చేసిన ప్రభుత్వం!
* హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2గా రంగనాథ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ డీసీపీగా పనిచేస్తున్న షానవాజ్‌ఖాసిం నియమితులయ్యారు. గతంలో కొత్తగూడెం ఓఎస్డీగా జిల్లాలో పనిచేసిన అనుభవం షానవాజ్‌కు ఉంది. నక్సల్స్ నియంత్రణలో దిట్టగా పేరున్న ఈయన్ను ప్రభుత్వం ఏరికోరి జిల్లా ఎస్పీగా పంపించినట్లు సమాచారం. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా రంగనాథ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2గా బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
23 నెలలపాటు రంగనాథ్ సేవలు..
సరిగ్గా 23 నెలలపాటు ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్రవేశారు. అనేక ఎత్తుపల్లాలను చవిచూసిన ఆయన నక్సల్స్ కార్యకలాపాలను నియంత్రించటంలో సఫలీకృతులయ్యారు. జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో పువ్వర్తి ఎన్‌కౌంటర్, ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించారు. ఇతర విప్లవ గ్రూప్‌లపై ఉక్కుపాదం మోపారు. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో అన్ని పార్టీలనూ మెప్పిస్తూ స్థానిక, మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్న భూ, స్థల వివాదాల పరిష్కారంలోనూ చొరవ చూపారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన దొంగతనాల్లో చోరీ సొమ్మును రికవరీ చేయించడంలోనూ రంగనాథ్ సక్సెస్ అయ్యారు. అయితే మధిర శ్రీరాం చిట్స్‌లో జరిగిన దొంగతనం కేసు మిస్టరీని ఛేదించలేకపోయారు.
ద్విచక్రవాహనాల చోరీలను అరికట్టడంలోనూ తనదైన శైలిలో ముందుకెళ్లారు. సామాజిక సేవపైనా రంగనాథ్ దృష్టి సారించారు. నగరంలో చెత్తపై సమరశంఖం పూరించారు. ‘క్లీన్ ఖమ్మం’ విషయంలో ఆయన దూకుడు ప్రదర్శించారు. నడివీధుల్లో చెత్తవేసే వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. ప్రజాదివస్ ద్వారా అనేక ఫిర్యాదులను పరిష్కరించారు. సంబంధిత స్టేషన్ అధికారులనూ అప్రమత్తం చేశారు.
ఎస్పీ రంగనాథ్ బదిలీ
Published Mon, Oct 27 2014 9:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM
Advertisement
Advertisement