సు‘ఘర్‌’కీ కహానీ! | Special Article On Prevention Of Diabetes | Sakshi
Sakshi News home page

సు‘ఘర్‌’కీ కహానీ!

Published Thu, Nov 14 2019 1:48 AM | Last Updated on Thu, Nov 14 2019 4:20 AM

Special Article On Prevention Of Diabetes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆమె పేరు అమృతారావు... హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు మెడికల్‌ కన్సల్టెన్సీలో కీలక పోస్టులో ఉన్నారు. ఆమె భర్తకు డయాబెటిస్‌ ఉంది. దీంతో ఆమె కూడా తన ఆహార అలవాట్లను భర్తకు అనుగుణంగా మార్చుకుంది. రోజూ ఇద్దరూ వ్యాయామం చేయడం, కార్బోహైడ్రేట్లు తక్కువున్న ఆహారం తీసుకోవడం చేస్తున్నారు. స్వీట్లు ఇంట్లో తయారు చేయడాన్ని పూర్తిగా ఆపేసింది. అలా తన భర్తకు అనుగుణంగా పూర్తిగా ఆహారపు అలవాట్లు మార్పు చేసుకుంది. డయాబెటిస్‌ నివారణలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండా లని ప్రపంచ డయాబెటిస్‌ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు అమృతరావు ఈ అలవాట్లు చేసుకుంది. నవంబర్‌ 14 ప్రపంచ డయాబెటిస్‌ నివారణ దినాన్ని పురస్కరించుకొని ఆ సమాఖ్య గతేడాది ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు ఆ థీమ్‌ను ప్రచారం చేస్తుంది. డయాబెటిస్‌ను కుటుంబ సమస్యగా పరిగణించాలని స్పష్టం చేసింది.

డయాబెటిస్‌ రాకుండా చూసుకోవడం, ఒకవేళ వస్తే దాన్ని సకాలంలో గుర్తించడం, ఆ తర్వాత నియంత్రించడంలో కుటుంబ సభ్యు లు కీలకపాత్ర పోషించాలని ప్రపంచ డయాబెటిస్‌ సమాఖ్య పేర్కొంది. అంటే కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్‌ ఉంటే, ఇతర సభ్యులు సహకరించాలని పేర్కొంది. వారి ఆహారం, వ్యాయామం, ఇతర జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చేలా మసలుకోవాలని కోరుతోంది. అంతేకాదు కుటుంబ సభ్యుల్లో ఇతరులకు రాకుం డా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని ప్రచారం చేస్తుంది. ఈ థీమ్‌ ప్రజల్లో విస్త్రృతంగా ప్రచారం జరగ లేదని నిమ్స్‌కు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ గంగాధర్‌ అంటున్నారు.  

సాధారణ స్థితికి రావొచ్చు.. 
ప్రీడయాబెటిస్‌ ఉంటే సాధారణ స్థితికి రావడం సాధ్యమే. నిత్యం వ్యాయా మం చేయడం, కార్బోహైడ్రేట్లు తక్కువగా తినడం, కూరగాయలు భుజించడం, నిద్ర సక్రమంగా పోవడం ద్వారా ప్రీడయాబెటిస్‌ నుంచి సాధారణానికి రావొచ్చు. రాష్ట్రంలో డయాబెటిస్‌ ఉన్న వారిలో దాదాపు 50% మం దికి తమకు డయాబెటిస్‌ ఉన్నట్లే తెలియదు. -డాక్టర్‌ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్‌

డయాబెటిస్‌ ఎలా లెక్కిస్తారంటే?  
ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా డయాబెటిక్‌ అసోసియేషన్‌ల ప్రకారం.. ఉదయం ఏమీ తినకుండా షుగర్‌ టెస్టు చేస్తే 126 ఎంజీ/డీఎల్‌ పైగా ఉంటే వారికి షుగర్‌ వ్యాధి ఉన్నట్లే లెక్కగడతారు. అలాగే ఆ తర్వాత ఏదైనా టిఫిన్‌ లేదా భోజనం చేశాక 2 గంటల సమయం గడిచాక మళ్లీ పరీక్షిస్తే 200 ఎంజీ/డీఎల్‌ పైగా ఉంటే కూడా డయాబెటిస్‌గానే పరిగణిస్తారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏమీ తినకుండా చేసే పరీక్షలో 110 నుంచి 125 వరకు మధ్య, అమెరికా డయాబెటిస్‌ అసోసియేషన్‌ ప్రకారం 100 నుంచి 125 మధ్య ఉంటే ప్రీడయాబెటిస్‌గా లెక్కిస్తారు. భోజనం లేదా టిఫిన్‌ అనం తరం 2 గంటల తర్వాత చేసే పరీక్షలో 140 నుంచి 199 ఎంజీ/డీఎల్‌ ఉంటే ప్రీడయాబెటిస్‌గా రెండు సంస్థలూ పరిగణిస్తాయని నిమ్స్‌ వైద్యురాలు డాక్టర్‌ బ్రియాటిన్‌ ఆని అంటున్నారు. మన దేశం మాత్రం అమెరికా డయాబెటిస్‌ అసోసియేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని అంటున్నారు.

ఇదిలావుంటే 3 నెలల సరాసరి నికర షుగర్‌ను లెక్కలోకి తీసుకొని చేసే పరీక్షే‘హెచ్‌బీఏ1సీ’. ఈ పరీక్షలో 6.5 పైగా రక్తంలో షుగర్‌ శాతం ఉంటే అప్పు డు కూడా డయాబెటిస్‌గానే పరిగణిస్తారు. 5.7 శాతం నుంచి 6.5 శాతం మధ్య ఉంటే ప్రీడయాబెటిస్‌ అంటారు. ఇక ప్రీడయాబెటిస్‌ అంటే డయాబెటిస్‌ ప్రమాదపు అంచున ఉన్నట్లు లెక్క. అంటే బోర్డర్‌ లైన్‌లో ఉన్నట్లు పరిగణించాలి. ప్రభుత్వాలు డయాబెటిస్‌ లెక్కల్లో ప్రీడయాబెటిస్‌ను లెక్కలోకి తీసుకోరు. ప్రీడయాబెటిస్‌లో ఉన్నవారు జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, రెగ్యులర్‌ వ్యాయామాలు చేయడం ద్వారా సాధారణ స్థితిలోకి రావొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలో డయాబెటిస్, బీపీలపై ప్రజలను పరీక్షించింది. మొత్తం 95.54 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 3.77 లక్షల మంది డయాబెటిస్‌ ఉన్నట్లు తేలింది. అలాగే 7.05 లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలింది. 

కుటుంబ సభ్యులదే కీలకపాత్ర..
డయాబెటిస్‌ను కుటుంబ సమస్యగానే చూడాలి. కుటుంబ సభ్యుల సహకారం లేకుండా డయాబెటిస్‌ను నియంత్రిం చడం గానీ, ఇతరులకు రాకుం డా కానీ చేయలేం. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. డయాబెటిస్‌ ఉన్నవారు, ప్రీడయాబెటిస్‌లో ఉన్నవారు తప్పనిసరిగా కనీసం రోజుకు అరగంట నడవాలి. కార్బోహైడ్రేట్లు తక్కువ ఉన్న భోజనం చేయాలి. – డాక్టర్‌ బ్రియాటిన్‌ ఆని, ఎండోక్రైనాలజిస్ట్, నిమ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement