కలెక్టర్ కృష్ణభాస్కర్
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ విధులను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగులపై కొరడా ఝుళిపించారు. కోనరావుపేట మండలం మంగళ్లపల్లె ప్రత్యేక అధికారి ఆర్.రాజగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కృష్ణభాస్కర్ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజగోపాల్‌ను మంగళ్లపల్లెకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రత్యేక అధికారిగా నియమించారు. రాజగోపాల్ విధులను నిర్లక్ష్యం చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. జిల్లాలోని ముగ్గురు ఎంపీడీవోలతో సహా 52 మంది ప్రత్యేక అధికారులు, 52 మంది పంచాయతీ కార్యదర్శులకు బుధవారం రాత్రి మెమోలు జారీ చేశారు.
గంభీరావుపేట, వేములవాడ రూరల్, బోయినపల్లి ఎంపీడీవోలకు కలెక్టర్ మెమోలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకే వీరికి మెమోలు జారీ అయ్యాయి. ముగ్గురు ఎంపీడీవోలు, 52 మంది ప్రత్యేక అధికారులు, 52 మంది పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామపంచాయతీ కార్యదర్శి రాజును గ్రామసభకు గైర్హాజరు అయినందుకు ఇటీవలే కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఐదురోజుల వ్యవధిలో పదిర కార్యదర్శి రాజు, మంగళ్లపల్లె ప్రత్యేక అధికారి రాజగోపాల్ సస్పెండ్ కావడంతో చర్చనీయాంశమైంది. 107 మంది ఉద్యోగులకు ఒకేసారి మెమోలు ఇవ్వడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పల్లె ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో కలెక్టర్ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగులను ఉపేక్షించకుండా సస్పెండ్ చేయడం, మెమోలు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment