నాటి మహిష్మతే..  నేటి భైంసా | Special Story On Bhainsa Mandal Adilabad | Sakshi
Sakshi News home page

నాటి మహిష్మతే..  నేటి భైంసా

Published Sat, Oct 5 2019 7:44 AM | Last Updated on Sat, Oct 5 2019 7:47 AM

Special Story On Bhainsa Mandal Adilabad - Sakshi

సాక్షి, భైంసా : మరాఠీ పురాణాల ప్రకారం చరిత్రకు సజీవ సాక్షంగా భైంసా పట్టణం నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పూర్వకాలంలో భైంసా పట్టణం మహిష్మతి నగరంగా మహిషాసురుని పాలనలో విరాజిల్లింది. మరాఠీ ఇతిహాసాలే ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. మహిషాసురుడు పెట్టే బాధలు తట్టుకోలేక ప్రజలు మహిష అనే అమ్మవారిని శరణు కోరారు. ప్రజల మొర ఆలకించిన అమ్మవారు ప్రత్యక్షమై మహిషాసురున్ని సంహరించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ పట్టణానికి మహిషాగా నామకరణం చేశారు. అప్పట్లో మహారాష్ట్రలో ఉన్న ఈ ప్రాంతాన్ని మహిషాగా, మైసగా పిలిచేవారు. కాలక్రమేణా మహిషా కాస్త మైసగా ఇప్పుడేమో భైంసాగా రూపాంతరం చెందింది. 

గణతంత్ర రాజ్యంగా...
క్రీ.పూ నాలుగో శతాబ్దం నాటికి భైంసా పట్టణం గణతంత్ర రాజ్యంగా ఉండేదని తెలుస్తోంది. అనంతరం శాతవాహన రాజైన మొదటి శాతకర్ణుడికి సామంత రాజ్యంగా ఉండేది. ఈ రాజు భైంసా పట్టణానికి సమీపంలోని కుభీర్‌ నుంచి కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల వరకు రాజ్యపాలన చేసినట్లు ఆధారాలున్నాయి. కాకతీయ మూల పురుషుడైన వెన్నరాజు భైంసా ప్రాంతంలోనివాడేనని చరిత్ర చెబుతోంది. 12,13వ శతాబ్దాల కాలంలో మహారాష్ట్రలోని దేవగిరి ప్రాంతాన్ని పరిపాలించిన శకుల అధీనంలోకి వెళ్లింది.

శకుల వంశపు రాజులు భైంసా, కుభీర్‌ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని దౌలతాబాద్‌ వరకు పరిపాలన చేశారు. 15, 16వ శతాబ్దాల కాలంలో భైంసా పట్టణం గోల్కొండను రాజధానిగా చేసుకొని హైదరాబాద్‌ ప్రాంతాన్ని పాలించిన నిజాంషాహిల అధీనంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో హిందూ సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్‌ మైసూరులో ఉన్న తన తండ్రిని కలిసేందుకు పుణె నుంచి భైంసా మీదుగానే వెళ్లాడని తెలుస్తోంది. 

సుంక్లి గ్రామానికి ఒక కథ...
భైంసా పట్టణానికి సమీపంలోని సుంక్లి గ్రామం ఆవిర్భావానికి చరిత్రలో చిన్న కథ ఉంది. చ్యపన మహార్షి సతీసుకన్యల ఉదాంతం ఈ ప్రాంతంలోనే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. సతీ సుకన్య పేరు మీదనే సుకన్య గ్రామం ఏర్పడిందని తెలుస్తోంది. కాలగమనంలో సుకన్య పేరు సుంక్లిగా మారింది. 

గట్టుమైసమ్మగా...
మైసాసురుడిని అంతమొందించిన తర్వాత మహిషమ్మ తల్లి భైంసా పట్టణానికి తూర్పున గుట్టపై ఉండిపోయింది. కొలిచిన వారికి కొంగుబంగారమై దీవిస్తున్న అమ్మవారికి అక్కడ ఆలయం నిర్మించారు. నేటికి ఈ ప్రాంతవాసులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ గుట్టనే మైసమ్మ గుట్టగా పిలుస్తున్నారు. మహిషాసుర ఆనవాలుగా వాటర్‌ ఫిల్టర్‌బెడ్‌ సమీపంలో గుట్టపై  రాతి పాదాల ముద్రలున్నాయి. భైంసా పట్టణ చరిత్ర తెలుగు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో చాలా విషయాలు వెలుగులోకి రాలేదు. చరిత్ర పరిశోధకులు ముందుకువచ్చి మరాఠీ పురాణాల్లో ఉన్న ఆధారాలను వెలుగులోకి తీసుకొస్తే ప్రత్యేక రాష్ట్రంలో భైంసా చరిత్రకు స్థానం దక్కుతుంది.  

ప్రత్యేక దీక్షలు...
భైంసా పట్టణంలో దుర్గాదేవి మైసమ్మగా ప్రత్యేక పూజలు అందుకుంటోంది. పట్టణానికి చెందిన రామ్‌లాల్‌ కుటుంబీకులు దశాబ్దాలుగా అమ్మవారి సేవలో ఉంటున్నారు. ఏటా యువత దసరా నవరాత్రుల్లో ప్రత్యేక దీక్షలు స్వీకరిస్తారు. వారంతా గట్టుమైసమ్మ, దుర్గాదేవి ఆలయాల్లో రెండు పర్యాయాలు స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. 

మహాపాదయాత్ర...
దీక్షాపరులంతా దసరా, నవరాత్రి ఉత్సవాలు ముగిసిన వెంటనే మహా పాదయాత్ర చేపడుతారు. భైంసా పట్టణం నుంచి 372 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్‌కు వెళ్లి భవానీమాతను దర్శించుకుంటారు. ఎనిమిది రోజులు పాదయాత్రగా సుమారు 1000 మంది భక్తులు పయనమవుతారు. భైంసా నుంచి మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ వరకు ఊరూరా భైంసా పాదయాత్ర బృందానికి స్వాగతాలు పలుకుతూ భోజనాలు ఏర్పాటు చేస్తారు. భైంసా పట్టణం అనగానే మహారాష్ట్రలోని తుల్జాపూర్‌వాసులకు పాదయాత్ర గుర్తుకొస్తుంది.

13 ఏళ్లుగా ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. తుల్జాపూర్‌ వెళ్లి భవానీమాతను దర్శించుకుని తిరుగుపయణమవుతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు తుల్జాపూర్‌ భవానీ అమ్మవారే ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహుకరించారని ఇప్పటికీ చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అప్పట్లో తుల్జాపూర్‌లోని భవానీమాతకు పూజలుచేసేవారని భక్తులంతా ఇప్పటికీ కథలుగా చెబుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement