కూలుతున్న శకలం.. మనసు వికలం | Special Story On Shyamghad Fort | Sakshi
Sakshi News home page

కూలుతున్న శకలం.. మనసు వికలం

Published Mon, Mar 2 2020 9:00 AM | Last Updated on Mon, Mar 2 2020 9:00 AM

Special Story On Shyamghad Fort - Sakshi

సగం వరకే అభివృద్ధి పనులు పూర్తయిన శ్యాంగఢ్‌

నిర్మల్‌: నిమ్మల.. పేరులోనే నిర్మలత్వాన్ని.. నిమ్మలమైన తత్వాన్ని నింపుకున్న ఈ ఊరిలోనూ ఎన్నో విశేషాలున్నాయి. ఎక్కడో భద్రాద్రి రామయ్య దగ్గరి నుంచి గోదారమ్మ వెంట వెనక్కి వచ్చిన దళవాయి నిమ్మల నాయుడు ఇక్కడి ప్రకృతికి పరవశుడయ్యాడు. స్థల విశేషతను గుర్తించి ఇక్కడే స్థిరపడ్డాడు. అలా.. ప్రస్తుత కస్బా ప్రాంతంలో 12 ఇండ్లతో మొదలైన ఊరికి తన పేరే పెట్టాడు. ఊరి చుట్టూ చెరువులను తవ్వించాడు. కోటలు కట్టించాడు. అనంతర పాలకులూ అదేరీతిలో అభివృద్ధి పరిచారు. కాకతీయులను తలపించేలా పాలన సాగించారు. ఆనాటి నిమ్మల రాజ్యమే తరాలు మారి.. నేడు నిర్మల్‌గా ఎదిగింది. నాడు రాజులు ఏలిన ఈ గడ్డపై నుంచి ఢిల్లీదాకా ఎదిగిన బిడ్డలూ ఉన్నారు. కాలగమనంలో దశాబ్ధాలు గిర్రున తిరిగిపోయినట్లే.. గతవైభవపు స్మృతులు ఒక్కొక్కటీ పోతున్నాయి. నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్‌లో కనుమరుగవుతున్నాయి. ఇన్నాళ్లు ఠీవీగా దర్పాన్ని చాటిన కోటలు.. వాటి గోడలు కూలిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు సగం కబ్జాకోరల్లో చిక్కుకుపోగా, ఇప్పుడు చారిత్రక గుర్తులు సైతం శకలాలుగా పడిపోతూ.. నిమ్మలవాసుల మనసులను వికలం చేస్తున్నాయి. పట్టించుకునే అధికారులు.. పాలకులు లేక ఘన చరిత్ర శిథిలదశకు చేరుతోంది.


కూలుతున్న శ్యాంగఢ్‌ ప్రధానద్వారం

నిమ్మల..ఓ మినీ ఓరుగల్లు
ఓరుగల్లును కాకతీయులు పకడ్బందీగా కట్టినట్లే.. నిమ్మలను పాలకులు నిర్మించారు. పట్టణం చుట్టూ సహజసిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులను రక్షణ కవచాలుగా మలిచారు. వాటిని ఆధారంగా చేసుకుంటూ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ఈ చెరువులను పట్టుకుని ఊరి చుట్టూ చైనాగోడను తలపించేలా ఇటుకలతో ప్రహరీగోడను కట్టించారు. గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. వాటిలో నిండుగా నీళ్లు.. అందులో మొసళ్లు ఉండేవట. చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడ ఎత్తైన బురుజులు నిర్మించారు. వాటిపై ఆయుధ సంపత్తి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక ఊరిమధ్యలో గల గుట్టపై ఖిల్లా(కోట) కట్టించారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మల్‌లో కోటలు, బురుజులు, రాజభవనాలు కళకళలాడేవి. ఇప్పుడవన్నీ శిథిలమై పోయాయి. పట్టించుకునే నాథుడు లేక పలు కోటలు, బురుజులను నేలమట్టం చేసి వాటి ఇటుకలతోనే ఇళ్లు కట్టుకున్నారు.

గఢ్‌.. గఢ్‌కో చరిత్ర
నిర్మల్‌ అంటే కోటలు, గఢ్‌లకు ప్రసిద్ధి. అందులో ఒక్కోగఢ్‌కు ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తైనగుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్‌గఢ్‌ ఆరోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్‌ అంటే 32. ఈ గఢ్‌లో ఒకదానికొకటి ఆనుకుని 32గదులు నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్‌గఢ్‌ అనే పేరొచ్చింది. శ్రీనివాసరావు కాలంలో ఫ్రెంచ్‌ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్‌గఢ్‌ను డంగుసున్నం, ఇటుక, రాయితో బలమైన కోటగా మార్చారు. ఎతైన బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్‌లోనే మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి వసతి కల్పించారు. దక్షిణ భారతదేశంలో అప్పట్లో ఆయుధ కర్మాగారంగా నిర్మల్‌కు పేరుంది. శ్రీనివాస్‌రావు తన పాలనకాలంలోనే ఎక్కువ గఢ్‌లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగఢ్‌ను నిర్మించారు. అప్పటి తన అశ్వసైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్‌గా పేరుపెట్టినట్లు చెబుతారు.


బంగల్‌పేట్, వెంకటాద్రిపేట్‌లలో కూలిపోతున్న ప్రహరీ

పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గఢ్‌ను దాటుకునే రావాల్సి ఉంటుంది. దీనికి ఓ వైపు కంచెరోని చెరువు ఉంది. చెరువుకు, గఢ్‌కు మధ్యలో నుంచే ప్రస్తుత 44వ నం. జాతీయరహదారి వెళ్తోంది. బంగల్‌పేట్‌ శివారులో ధం–ధంగఢ్, వెంకటాద్రిపేట్‌లో మరోగఢ్, బత్తీస్‌గఢ్‌ పక్కనే వేంకటేశ్వర(ఏకశిలా)గఢ్, సోన్‌ సమీపంలో సోన్‌గఢ్, చిట్యాలలో చిట్టీగఢ్‌లను నిర్మించారు. నిర్మల్, చుట్టుపక్కల కలిపి మొత్తం 64గఢ్‌లను ఫ్రెంచ్‌ ఇంజినీర్ల సాయంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతీగఢ్‌పైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి ఉండేవి. ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటిపక్కనే, వారు కూర్చునేందుకు నీటితొట్టిలను నిర్మించారు. ఈగఢ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకదాని నుంచి మరోదానికి సొరంగమార్గం ఉండటం.

మంటలు వేసి తెలిపేవారు
ఈగఢ్‌లను ఎత్తైన గుట్టలపై నిలువెత్తుగా నిర్మించడానికీ కారణం ఉంది. వీటిపై నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు వీక్షించవచ్చు. సెల్‌ఫోన్లు, వైర్‌లెస్‌లు లేనటువంటి ఆరోజుల్లో సహజసిద్ధమైన సాంకేతికతను ఉపయోగించేవారు. పట్టణంపైకి దక్షిణం వైపు నుంచి శత్రువులు దాడికి వస్తుంటే మొదట సోన్‌గఢ్‌పై  సైనికులు గుర్తించేవారు. వెంటనే అగ్గిరాజేసి మంటలు పెట్టేవారు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంగఢ్‌పై ఉన్న సైనికులు గమనించి వారు కూడా మంట రాజేసేవారు. ఈ మంటల పొగలు తూర్పు వైపున ఉన్న బత్తీస్‌గఢ్‌పై సైనికులు గుర్తించి వారు కూడా మంటలు పెట్టేవారు. ఈమంటలు నేరుగా పట్టణం మధ్యలో ఖిల్లాగుట్టపై ఉన్న రాజభవనానికి కనిపిస్తాయి. సైన్యాధికారులు, పాలకులు ఆ మంటలను గమనించి తమకు ఏదో ఆపద రాబోతుందని అప్రమత్తమై శత్రువులను ఎదుర్కొనేవారు.


బంగల్‌ చెరువు వద్ద సీమోల్లంఘన ద్వారం

పక్కాగా పట్టణ నిర్మాణం
నిమ్మల ప్రాంతాన్ని పాలించిన నిమ్మలనాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావు, తదితరులు ఇక్కడి ప్రజలకు చక్కటి పాలన అందించారనడానికి ఊరిచుట్టూ నిర్మించిన గొలుసుకట్టు చెరువులే నిదర్శనం. ఊరి చుట్టూ ప్రహరీగోడతో పాటు పొలిమేరల్లో పట్టణంలోనికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా బురుజులు నిర్మించారు. ఈ బురుజులకు బలమైన పొడవాటి గొలుసులు ఉండేవి. రాత్రిపూట ఇరువైపులా ఉన్న గొలుసులతో మార్గాలను మూసి వేసేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ పట్టణంలో చైన్‌గేట్‌ వద్ద ఈ బురుజులు, గొలుసులు ఉండేవి. వీటిæ కారణంగా దీనికి చైన్‌గేట్‌ అనే పేరొచ్చింది.  బంగల్‌పేట్‌ శివారులోనూ రోడ్డుకిరువైపులా బురుజులు ఉన్నాయి. బురుజులు, గోడచుట్టూ ఉన్న కందకంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ప్రజల అవసరాలను తీర్చేది. కాలక్రమంలో ఈ కందకాన్ని స్వర్ణప్రాజెక్టు జౌళినాలాగా మార్చారు. ప్రస్తుతం ఇది ఓ పెద్ద మురికికాలువగా మారింది.


బంగల్‌పేట్‌ శివారులో బురుజులు

గత వైభవమేనా..
గోల్కొండ, వరంగల్‌ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్‌ కోటలను నాటి పాలకులు నిర్మించినా నేటి పాలకుల పట్టింపులేనితనంతో వెలుగులోకి రాలేదు. ఇప్పటికే చాలా కోటలు, బురుజులు ఆక్రమణలకు గురయ్యాయి. చాలావరకు దెబ్బతింటున్నాయి. పర్యాటకప్రాంతంగా శ్యాంగఢ్‌ను అభివృద్ధి చేస్తామని ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక్కడ నిర్మించిన హరిత హోటల్‌ ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరింది. బత్తీస్‌గఢ్‌ చుట్టూ గుట్టలపై ఉన్న క్వారీల పేలుళ్ల ధాటికి గఢ్‌ గోడలు బీటలు వారాయి. రోడ్డు వెడల్పులో చైన్‌గేట్‌ను నామరూపాల్లేకుండా కూల్చేశారు.

దృష్టి పెట్టేనా...
నిర్మల్‌ జిల్లాకు చారిత్రక ప్రాంతంగా.. రాజకీయకేంద్రంగా పేరున్నా.. పర్యాటక అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. చారిత్రక కట్టడాలతో పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నా పట్టించుకునే నాథుడు లేడు. వినాయకుల నిమజ్జనం కోసం బంగల్‌చెరువు వద్ద గల సీమోల్లంఘన ద్వారాలను కూల్చేశారు. కొత్తగా అభివృద్ధి చేయకున్నా చరిత్రకు గుర్తుగా మిగిలిన కట్టడాలను మాత్రం కాపాడాలంటూ జిల్లావాసులు మొరపెట్టుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement