కరాటేలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు
కరీంనగర్‌ఎడ్యుకేషన్: కస్తూరిబాగాంధీ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నైపుణ్యాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యాసనాభివృద్ధి(ఎల్‌ఈపీ)పేరుతో శుక్రవారం నుంచి వచ్చేనెల 12వరకు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని కేజీబీవీలు, ప్రభుత్వ, ఆదర్శ పాఠశాలల్లో చదువుల్లోని సామర్థ్యాలు, గణిత చతుర్విది ప్రక్రియల్లో వెనుకంజలో ఉన్న బాలికల కోసం గతేడాది నుంచి ఎంపిక చేసిన కేజీబీవీల్లో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎల్‌ఈపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వెనకబడిన విద్యార్థినులకు..
చదువులో వెనకబడిన విద్యార్థినులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడనుంది. జిల్లాలోని కరీంనగర్ కేజీబీవీ పాఠశాలను ఈ కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. 11 కేజీబీవీలకు చెందిన 240 మంది విద్యార్థులను ఎంపిక చేసి వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. కేజీబీవీతో పాటు సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని 7,8,9 తరగతుల్లో చదువులో వెనుకబడిన బాలికలను ఎంపిక చేసి భోజనంతో పాటు ఇతర వసతులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 150మంది బాలికలు సైతం శిక్షణలో చేర్చుకోవాలని విద్యాశాఖ సూచించింది.
242 మందికి శిక్షణ...
జిల్లాలోని 12 కస్తూరిబా పాఠశాలల్లో అభ్యాసనాభివృద్ధి కార్యక్రమం అమలవుతోంది. కొత్తగా ఏర్పడిన ఇల్లందకుంట మండలం మినహా 11 కేజీబీవీలకు చెందిన 242 మంది విద్యార్థులను నైపుణ్య శిక్షణాశిబిరానికి ఎంపిక చేశారు. వీరు ఇంటి నుంచి దుప్పట్లు , ఇతర సామగ్రి తెచ్చుకోవాల్సి ఉంటుంది. శిక్షణకాలంలో ఇక్కడే ఉచిత భోజనం, వసతిసౌకర్యం కల్పిస్తారు. ఈ విషయమై ఇప్పటికే ఉపాధ్యాయినులకు శిక్షణ ఇచ్చారు.
శిక్షణ ఇచ్చే అంశాలివే...
బాలికలు తెలుగు, ఆంగ్ల విషయాలపై పట్టు సాధించేలా వ్యాకారణాంశాలు వివరిస్తారు. చదవడం, రాయడంతో పాటు గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చేస్తారు. స్వతహాగా వ్యాసం రాసే సామర్థ్యం, సైన్స్ సబ్జెక్టుల్లో శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానాన్ని పెంపొందింపజేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆత్మరక్షణకు దోహదపడే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. గణితంలో ప్రాథమిక అంశాలు, సూత్రాలు బోధిస్తున్నారు. గ్రంథాలయాల్లో పుస్తక పఠనంతో పాటు కంప్యూటర్ ప్రాథమిక అంశాలపై శిక్షణ ఉంటుంది. భవిష్యత్‌లో స్వయం ఉపాధికి దోహదపడే లా కుట్లు, అల్లికలు నేర్పిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలపై తర్ఫీదు ఇస్తున్నారు. క్రీడలు, యోగా, ధ్యానం, చిత్రలేఖనం, క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నారు. సామాజిక అంశాలపై విద్యార్థినులతో బృంద చర్చలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన డాక్యూమెంటరీలతో దృశ్యం రూపంలో ఆంగ్లం బోధిస్తున్నారు. ప్రతీరోజు విద్యార్థినులకు పరీక్ష నిర్వహించి, జవాబు పత్రాలను దిద్ది వారిలోని లోపాలు గమనిస్తున్నారు. ప్రతీ బాలికపై వ్యక్తిగత శ్రద్ధ వహించి వారిలోని లోపాలను అధిగమించేలా కృషి చేస్తున్నారు. శిక్షణ కార్యక్రమం ముగింపు రోజు బాలికలను ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment