సాక్షి, సికింద్రాబాద్: దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లను (100 జతలు) రైల్వేబోర్డు ఖరారు చేసింది. జోన్లు, రూట్ల వారీగా నడిపే రైళ్లు, ప్రయాణ వేళల వివరాల్ని అన్ని జోన్ల జీఎంలకు పంపించింది. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రూట్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు. తమ జోన్‌లో 9 జతల రైళ్లను నడుపుతామని, మరో నాలుగు జతల రైళ్లు తమ జోన్ గుండా ప్రయాణిస్తాయని దక్షిణమధ్య రైల్వే గురువారం తెలిపింది. మొత్తం 13 జతల రైళ్ల వివరాలను వెల్లడించింది. (అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం)
ప్రస్తుతం ఉన్న నిబంధనలను అనుసరించి ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో టిక్కెట్ జారీ చేస్తామని.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రైలులోకి అనుమతించబోమని పేర్కొంది. గమ్యస్థానం చేరిన తర్వాత ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ ఆరోగ్య మార్గదర్శకాలకు లోబడి ప్రయాణికులు సహకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ మాత్రమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌చేసుకోవచ్చు. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హెచ్‌ఓఆర్ ద్వారా టిక్కెట్లు బుక్‌చేసుకునే వీలు కల్పించింది. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్ర్య సమరయోధులు, రైల్వే, మిలటరీ, పోలీస్ వారెంట్లు, వోచర్లు, రైల్వే బోర్డు నిర్దేశించిన 4 రకా దివ్యాంగులు, 11 రకాల రోగులు విద్యార్థులు పీఆర్‌ఎస్(పాసింజర్ రిజర్వేషన్ సిస్టం) కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment