దూకుడుకు లాక్‌ | Speed Governors For Transport Vehicles In Telangana | Sakshi
Sakshi News home page

దూకుడుకు లాక్‌

Published Sun, Sep 15 2019 2:49 AM | Last Updated on Sun, Sep 15 2019 5:37 AM

Speed Governors For Transport Vehicles In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వాహనాల వేగనియంత్రణ చర్యల్లో రవాణా శాఖ స్పీడ్‌ పెంచింది. ఫిట్‌నెస్‌పైనా ప్రత్యేక దృష్టి సారించింది. మరో 2 రోజుల్లో అన్నిరకాల రవాణా వాహనాలకు (ఆటోరిక్షాలకు మినహాయింపు) స్పీడ్‌ గవర్నర్స్‌ తప్పనిసరి చేయనుంది. స్పీడ్‌ గవర్నర్స్‌ ఉన్నవాటికే అధికారులు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ చేస్తారు. ఆర్టీసీ, స్కూల్, ప్రైవేట్‌ బస్సులు, క్యాబ్‌లు, ట్యాంకర్లు, చెత్త తరలింపు వాహనాలు, లారీలు, డీసీఎంలు తదితర అన్ని రకాల ప్రయాణికుల, సరుకు రవాణా వాహనాలు స్పీడ్‌ గవర్నర్స్‌ను ఏర్పా టు చేసుకోవలసి ఉంటుంది. వాహ నాల వేగాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌లో 60 కిలో మీటర్ల వరకు, ప్రధాన రహదారులపై 80 కిలోమీటర్ల వరకు అనుమతినిచ్చారు.

అపరిమితమైన వేగంతో దూసుకెళ్లే వాహనాలను అదుపు చేయడంలో డ్రైవర్లు విఫలం కావడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించి స్పీడ్‌ గవర్నర్స్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2015 తరువాత తయారైన అన్నిరకాల రవాణా వాహనాలకు వాటి నిర్మాణ సమయంలోనే కంపె నీలు వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేశారు. 2015 కంటే ముందు తయారైన వాహనాలకు మాత్రం అలాంటి పరికరాలు లేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ స్పీడ్‌ గవర్నర్స్‌ నిబంధనను తప్పనిసరి చేశారు. దీనిపై పలు లారీ యాజమాన్య సంఘాల నేతలు, వాహన యజమానులు తమకు కొంత గడువు కావాలని రవాణాశాఖను కోరారు. మరోవైపు మరికొన్ని సంస్థలు రహదారి భద్రత దృష్ట్యా వేగ నియంత్రణ పరికరాలను తప్పనిసరిగా అమలు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 

ఆ సంస్థలకే ధ్రువీకరణ బాధ్యత
ఆటోమెబైల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ), ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ వంటి కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు ధ్రువీకరించిన కంపెనీలకు చెందిన స్పీడ్‌ గవర్నర్స్‌ను మాత్రమే వాహనాలకు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా 37 స్పీడ్‌గవర్నర్స్‌ తయారీ కంపెనీలను సర్టిఫై చేశాయి. ఈ కంపెనీలు తయారు చేసిన పరికరాలకు ఐఎస్‌ఐ ఆమోదం కూడా లభించింది. ఎంకే, ప్రికోల్‌ వంటి సంస్థలకు చెందిన స్పీడ్‌గవర్నర్స్‌ అంతర్జాతీయంగా కూడా ప్రామాణికమైనవనే గుర్తింపు ఉంది. కానీ తెలంగాణలో కేవలం 3 కంపెనీలు కాన్వెర్జ్, మెర్సిడా, క్రిసాల్‌లకు చెందిన స్పీడ్‌ గవర్నర్స్‌ ఏర్పాటుకు మాత్రమే రవాణా అధికారులు ఇప్పటి వరకు అనుమతినిచ్చారు. 

నియంత్రణలేని ధరలు..
కాన్వెర్జ్, మెర్సిడా, క్రిసాల్‌ కంపెనీల స్పీడ్‌ గవర్నర్స్‌ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రూ.2,500 నుంచి రూ.3,000లకే ఒక పరికరం చొప్పున విక్రయిస్తుండగా తెలంగాణలో వీటి ధర రూ.7,500 చొప్పున ఉండటంపట్ల లారీ యాజమాన్యసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకే కంపెనీకి చెందిన ఒకేరకమైన ఉత్పత్తులను ఒక్కోరాష్ట్రంలో ఒక్కోవిధమైన ధరలకు ఎలా విక్రయిస్తారని ప్రశ్నిస్తున్నాయి.

4 లక్షల వాహనాలకు స్పీడ్‌ గవర్నర్స్‌
సుమారు 4 లక్షల రవాణా వాహనాలు స్పీడ్‌ గవర్నర్స్‌ పరిధిలోకి రానున్నాయి. వీటన్నింటికీ నిర్ణీత గడువులోపు స్పీడ్‌ గవర్నర్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ, ఇరుకు రోడ్లు, ఫ్లైఓవర్, మెట్రోరైలు నిర్మాణ పనుల దృష్ట్యా వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement