ఊపందుకున్న వాటర్‌గ్రిడ్ పనులు
•సింగూరులో రూ.280 కోట్లతో ఇన్‌టెక్ వెల్ నిర్మాణం
•పల్లెలకు నీటి సరఫరాపై కొనసాగుతున్న సర్వే
•నేడు మంత్రి కేటీఆర్‌సమీక్ష
సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులకు జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇన్‌టెక్ వెల్, ఫిల్టర్‌బెడ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు ప్రారంభించారు. మెదక్, సంగారెడ్డి వాటర్‌గ్రిడ్‌లలో భాగంగా సింగూరు ప్రాజెక్టు వద్ద రెండు ఇన్‌టెక్ వెల్స్, ఫిల్టర్‌బెడ్లు నిర్మించనున్నారు. వచ్చేనెల పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 2,456 నివాస ప్రాంతాల్లోని ప్రజలకు రోజుకు ఒక్కొక్కరికి వందలీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా జిల్లాలో రూ.2,400 కోట్లతో వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశారు. మెదక్ వాటర్‌గ్రిడ్ ద్వారా మెదక్, అందోలు, నారాయణఖేడ్ నియోజక వర్గాలకు, సంగారెడ్డి గ్రిడ్ ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు.
దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు మెదక్ గ్రిడ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మొదట భావించినా ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ నియోజక వర్గంతోపాటు సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాటర్‌గ్రిడ్‌లో మంజీర మంచి నీటి పథకాన్ని విలీనం చేసి నర్సాపూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయనున్నట్టు సమాచారం. వాటర్‌గ్రిడ్ నుంచి పైప్‌లైన్ల ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేస్తున్నారు. పైప్‌లైన్ల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు.
ఇదిలావుంటే గ్రిడ్‌కు అవసరమైన కరెంటును సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో సన్నద్ధమవుతోంది. సింగూరులో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ వద్ద వాటర్ పంపింగ్, ఫిల్టర్లు పనిచేసేందుకు ఎంత విద్యుత్ అవసరమవుతోంది అంచనా వేసి అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వాటర్‌గ్రిడ్ కోసం సింగూరు వద్ద ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ నిర్మించనున్నట్టు సమాచారం.
రూ.280 కోట్లతో ఇన్‌టెక్ వెల్, వాటర్ ఫిల్టర్లు..
సంగారెడ్డి, మెదక్ వాటర్‌గ్రిడ్‌లకు సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీర నీటిని వినియోగించనున్నారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా అవసరమైన తాగునీటిని కేటాయించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సంగారెడ్డి వాటర్‌గ్రిడ్‌కు 1.25 టీఎంసీలు, మెదక్ వాటర్‌గ్రిడ్‌కు మరో 1.25 టీఎంసీల నీరు అవసరమవుతాయని అంచనా. సంగారెడ్డి, మెదక్ వాటర్‌గ్రిడ్‌లకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సింగూరు ప్రాజెక్టు సమీపంలో వేర్వేరుగా ఇన్‌టెక్ వెల్, ఫిల్టర్లు నిర్మించనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదివారం ఇన్‌టెక్‌వెల్ నిర్మించే ప్రాంతాన్ని సందర్శించ నున్నారు.