తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచాయి
చానళ్ల నిషేధంపై హోంమంత్రి నాయిని
హైదరాబాద్ : ‘రాష్ట్రంలో ఆ రెండు చానళ్ల నిషేధం మంచిది కాదు. అవి తెలంగాణ సమాజానికి చేసింది కూడా మంచిది కాదు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయి. కొద్దో గొప్పో టీవీ-9 వాళ్లకు పశ్చాత్తాపం ఉంది. ఇంకో ఆయనకు ఉన్నంత తలబిరుసు మరెవ్వరికి లేదు’ అని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయుడబ్ల్యుజే) హైదరాబాద్ జిల్లా తొలిమహాసభలు రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి నర్సింహారెడ్డి మాట్లాడుతూ నిషేధించిన ఆ రెండు చానళ్లను పునరుద్ధరణ జఠిలమైన సమస్యని, దాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ చూసుకుంటారన్నారు. చానళ్ల పునరుద్ధరించాలని కేంద్ర సమాచారమంత్రి ప్రకాష్ జవదేకర్ తమ ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం సరికాదన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మం త్రి మహమూద్ అలీ, తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీజీవో అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా టీయుడబ్ల్యుజే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా యోగానంద్, ప్రధాన కార్యదర్శులుగా రాజు, అమిత్, ఇతర కార్యవర్గం ఎన్నికైంది.
కబ్జా స్థలాల స్వాధీనానికి చర్యలు: బంజారాహిల్స్‌లో కబ్జాకు గురైన స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి కృషి చేస్తానని, ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానని రాష్ట్ర హోంశాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌కు చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.