tv-9
-
పరారీలో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీవీ–9 వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసినట్లు సమాచారం. ఈ నోటీసులకు స్పందించకపోతే రవిప్రకాశ్ అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. ఫోర్జరీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే సీఆర్పీసీ 160 ప్రకారం ఈనెల 9, 11వ తేదీల్లో రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన రవిప్రకాశ్ తాను విచారణకు హాజరు అయ్యేందుకు 10 రోజుల సమయం కావాలని లాయరు ద్వారా కోరినట్లు సమాచారం. మరో నిందితుడు, సినీనటుడు శొంఠినేని శివాజీ ఇంతవరకూ పత్తాలేడు. ఈ కేసులో మరో నిందితుడు ఎంకేవీఎన్ మూర్తి విచారణకు సహకరిస్తున్నారు. మూర్తిని ఇప్పటికే పలుమార్లు పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను మూర్తి పోలీసులను వివరించినట్లు సమాచారం. సెక్షన్ 41 ప్రకారం నోటీసులు! ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న రవిప్రకాశ్‌కు పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం రాత్రి రవిప్రకాశ్ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే గతంలో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వగా, ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. ఈనెల 9న ఒకసారి, 11వ తేదీన మరోసారి సెక్షన్ 160 కింద పోలీసులు నోటీసులిచ్చినా రవిప్రకాశ్, శివాజీలు ఇంతవరకూ జాడలేకుండా పోయారు. ఈ కేసులో ఇప్పటికే ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ), 72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై ప్రధానంగా ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులు నమోదయ్యాయి. కేసులో తీవ్రత ఆధారంగా పోలీసులు సెక్షన్ 41 ద్వారా నోటీసులు జారీ చేశారు. అంతుబట్టని శివాజీ వ్యవహారం ఈ వ్యవహారంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన నటుడు శివాజీ పాత్ర అంతుబట్టడంలేదు. టీవీ9లో 8 శాతం వాటా ఉన్న రవిప్రకాశ్ తనకు 2018, ఫిబ్రవరిలో 40వేల షేర్లు విక్రయించాడని, ఒప్పందం ప్రకారం తనకు ఏడాదిలోగా షేర్లు బదిలీ చేయలేదని, అలందాకు టీవీ9 విక్రయిస్తున్న విషయం కూడా తన వద్ద దాచారని ఆరోపిస్తూ శివాజీ ‘లా ఆఫ్ ట్రిబ్యునల్’ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు అన్యాయం జరిగినపుడు రవిప్రకాశ్‌పై ఫిర్యాదు చేయకుండా యాజమాన్య మార్పులను తెరపైకి తేవడం అంతా రవిప్రకాశ్ పథకంలో భాగమేనని అలందా మీడియా అనుమానిస్తోంది. ఇప్పుడు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినపుడు బాధితుడిగా తనకు జరిగిన అన్యాయం చెప్పుకునే అవకాశం వచ్చినా, ఎందుకు పరారీలో ఉన్నాడన్న ప్రశ్నలకు శివాజీ ఆచూకీ లభిస్తేనే సమాధానం దొరుకుతుంది. సెక్షన్ మారిస్తే ఏంటి? సెక్షన్S160 ప్రకారం.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కేవలం విచారణకు మాత్రమే పిలిచే అవకాశం ఉంటుంది. అదే సెక్షన్ 41కి మారిస్తే.. కేసు తీవ్రత ఆధారంగా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లోనే ఈ సెక్షన్‌ని ప్రయోగిస్తారు. నిందితులు సాక్షులను ప్రభావితం చేయడం, వారిపై బెదిరింపులకు దిగడం, కీలక ఆధారాలు ధ్వంసం చేస్తారన్న అనుమానం వస్తే.. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని అరెస్టు చేసే వీలుంటుంది. అందుకే, పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. -
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచాయి
చానళ్ల నిషేధంపై హోంమంత్రి నాయిని హైదరాబాద్ : ‘రాష్ట్రంలో ఆ రెండు చానళ్ల నిషేధం మంచిది కాదు. అవి తెలంగాణ సమాజానికి చేసింది కూడా మంచిది కాదు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయి. కొద్దో గొప్పో టీవీ-9 వాళ్లకు పశ్చాత్తాపం ఉంది. ఇంకో ఆయనకు ఉన్నంత తలబిరుసు మరెవ్వరికి లేదు’ అని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయుడబ్ల్యుజే) హైదరాబాద్ జిల్లా తొలిమహాసభలు రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి నర్సింహారెడ్డి మాట్లాడుతూ నిషేధించిన ఆ రెండు చానళ్లను పునరుద్ధరణ జఠిలమైన సమస్యని, దాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ చూసుకుంటారన్నారు. చానళ్ల పునరుద్ధరించాలని కేంద్ర సమాచారమంత్రి ప్రకాష్ జవదేకర్ తమ ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మం త్రి మహమూద్ అలీ, తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీజీవో అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా టీయుడబ్ల్యుజే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా యోగానంద్, ప్రధాన కార్యదర్శులుగా రాజు, అమిత్, ఇతర కార్యవర్గం ఎన్నికైంది. కబ్జా స్థలాల స్వాధీనానికి చర్యలు: బంజారాహిల్స్‌లో కబ్జాకు గురైన స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి కృషి చేస్తానని, ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానని రాష్ట్ర హోంశాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌కు చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. -
'టీవీ 9 పై కఠిన చర్యలు తీసుకోవాలి'
-
టీవీ-9, ఆంధ్రజ్యోతిపై నిర్ణయం స్పీకర్, చైర్మన్లదే
హైదరాబాద్ : శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ-9, ఆంధ్రజ్యోతిపై ఎలాంటి చర్య తీసుకోవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్లకు అప్పగించారు. ఈ మేరకు సభ్యులు శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుబాటులో ఉన్న చట్టాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ఈ సందర్భంగా స్పీకర్, మండలి ఛైర్మన్లకు విజ్ఞప్తి చేశారు. కాగా టీవీ-9 చానల్, ఆంధ్రజ్యోతి పత్రికపై కేసీఆర్ నిన్న శాసనసభలో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ-9ను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెగటివ్‌గా చూయించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తోందని... పని గట్టుకుని విషం చిమ్ముతోందని మండిపడ్డారు. టీవీ-9, ఆంధ్రజ్యోతిపై చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరికలు చేశారు. -
టీవీ 9పై కేసీఆర్ నిప్పులు
* ఎమ్మెల్యేలను ఇంతగా కించపరుస్తరా? * పాచి కల్లు తాగిన మొహాలంటారా? * టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూసేటోళ్లా! * ఆ మొహాలను మల్టీప్లెక్స్‌కు పట్టుకొచ్చి కూర్చోబెట్టామంటారా? * ఏమిటీ దురహంకారం దేనికైనా హద్దుంటుంది * పిట్టబెదిరింపులకూ, లంగప్రచారాలకూ బెదిరిపోం * ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు సాక్షి, హైదరాబాద్: టీవీ-9 చానల్, ఆంధ్రజ్యోతి పత్రికపై తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనసభలో నిప్పులు చెరిగారు. శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ-9ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెగటివ్‌గా చూయించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తోందని... పనిగట్టుకుని విషం చిమ్ముతోందని మండిపడ్డారు. కేసీఆర్ ఆగ్రహం ఆయన మాటల్లోనే... ‘దేనికైనా ఒక హద్దు ఉంటుంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెలంగాణ సమాజం సమైక్య రాష్ర్టంలో వలసవాదుల అహంకారం కింద చాలా బాధ అనుభవించింది. చాలా భయంకరమైన వివక్షకు గురైంది. భాష మీద, యాస మీద, సంస్కృతి మీద చాలా భయంకరమైన దాడి జరిగింది. అయినా మౌనంగా భరించాం. గుడ్ల నీళ్లు గుడ్లలోనే ఓపుకున్నం. కూసున్న కాడనే ఏడ్చినం. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఇంతకంటే దుర్మార్గం ఈ ప్రపంచంలో ఉంటుందా? తెలంగాణ శాసనసభ మీద, ప్రొటెం స్పీకరు జానారెడ్డిని, మంత్రివర్గ సభ్యులను, ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలను చూయించుకుంటూ టీవీ-9 అనే ఒక సంస్థ... టూరింగ్ టాకీస్‌లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్‌లల్లో కూసుండబెట్టినట్టు ఉందంట తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి. ఫుటేజ్ ఉందిప్పుడు. నాకు ఇవ్వాళ పొద్దున దాకా తెలియదు. నిన్ననే తెలిసుంటే నేను అగ్రహోదగ్రుడయ్యేవాడిని. నిజామా, అబద్దమా అని తెలియక ఇయాళ ఫుటేజ్ తెప్పించి చూసినా. ఎవరికో ఏదో ఇస్తే... ఎక్కడో పెట్టుకున్నట్టు... ఇలా చూయించారు. ఇంకొన్ని నేనిక్కడ చెప్పలేను. శాసనసభ కొత్తగా సమావేశమైనప్పుడు శాసనసభ సంప్రదాయం ఏమిటంటే శాసనసభ రూల్స్ బుక్, భారత రాజ్యాంగం పుస్తకంతో పాటు ఒక ఐ-ప్యాడ్ ఇస్తారు. చూసి రాసిన ప్రమాణ స్వీకారం చదవలేని మొహాలకు ఐ-ప్యాడ్లు ఇస్తే యాడ మడిచి పెట్టుకుంటారో? ఇదో కామెంటు. తెలంగాణ శాసనసభ్యుల మొహాలు పాచి కల్లు తాగిన మొహాలంట. ఈ టీవీ-9 అనే సంస్థ మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రసారం చేసింది. ఒక దళిత అమ్మాయి...బాడిగె శోభ అని చొప్పదండి నుంచి గెలిచి వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం తడబడింది. నాకు భయమయితాంది సార్ అని నాతో ఉన్న అప్యాయతతోనే నాకు చెప్పింది. ఏం ఫరవాలేదు ధైర్యంగా వెళ్లు అని చెప్పినా. ఆ అమ్మాయి చదివింది. దీన్ని పొద్దాక చూపిస్తారా టీవీలో. తెలంగాణ శాసనసభను, శాసనసభాపతిని, మంత్రులను ఇలా చూయిస్తరా? ఇంత అహంకారమా? ఏం మాటలు? ఈ సీడీ రెడీగా ఉంది. వీటిని సర్క్యులేట్ చేస్తాను. అన్ని పార్టీలు కలిసి చూద్దాం. విషం కక్కుతున్నారు.. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష్య. ఒక అసూయ. తెలంగాణ రాష్ట్రం ఏట్లా ఏర్పడింది అనే న్యూనతా భావాన్ని కలిగించే ప్రయత్నం కొన్ని పత్రికలు చేస్తున్నాయి. పనిగట్టుకుని ఒక పత్రిక, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక. ప్రతీ రోజూ విషం కక్కుతోంది. కేబినెట్ మీటింగులో నేను మంత్రులకు ఆదేశాలు ఇచ్చాను. మనం మాట్లాడుకునే కొన్ని విషయాలు నిర్ణయాలు కావు. అవి బయటకు చెప్పకండి అని. డోంట్మేక్ లూజ్ కామెంట్స్ అని మంత్రులకు చెప్పిన. దానికి ఏం రాస్తది ఈ పత్రిక అంటే... మొహం చాటేసిన మంత్రులంట. కేబినెట్లో చెప్పినవి నీకు పూసగుచ్చినట్టు చెబితే చెప్పినట్టు లేకపోతే మొహం చాటేసినట్టా? ఆంధ్రా నుంచా వేసేయ్ పన్ను... 500 కోట్ల బాదుడు ఇలాంటి వార్తలను ఈ రోజు కూడా ప్రచురించింది. లేని ఇష్యూను ఉన్నట్టు చూయించే ప్రయత్నం జరుగుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నెగటివ్ షేడ్‌లో చూయించే ప్రయత్నం చేస్తున్నరు. నేను వీరిని హెచ్చరిస్తున్నా. వీళ్లను వదిలే ప్రసక్తే లేదు. ఇది శాసనసభ గౌరవానికి సంబంధించింది. చాలా తుఫానులు చూసినం. చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నం. నేను చాలా మొండి ఘటాన్ని. ఈ పిట్ట బెదిరింపులకు, లంగ ప్రచారానికి ఎవరూ భయపడే వారు లేరిక్కడ. నా గుండె మండి చెబుతున్నా ఏం చేసినా తట్టుకుంటాం. తగిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం తరహాలో కేబుల్ వ్యవస్థను అవసరమైతే చట్టం చేసి టేకోవర్ చేస్తామని పేర్కొన్నారు. -
టీవీ-9 వ్యాఖ్యలు అమానవీయం: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ పట్ల వ్యంగ్యంగా వార్తలు ప్రసారం చేస్తే ప్రసార మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కొన్ని ఛానెళ్లు, పత్రికల తీరుపై శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలను అవమానించిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచిన మీడియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. టీవీ-9, ఆంధ్రజ్యోతిలపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన శాసన సభ్యుల బొమ్మలు చూపిస్తూ టీవీ-9 ఛానల్ చేసిన వ్యాఖ్యలు అమానవీయమన్నారు. ''టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూసేవారిని తీసుకొచ్చి మల్టీఫెక్స్లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో... తెలంగాణ శాసనసభ అలాం ఉందని వ్యాఖ్యలు చేశారు. పాచికల్లు తాగిన ముఖాలుగా శాసన సభ్యులను టీవీ-9 అభివర్ణించింది. అంతటి అహంకారంతో వ్యవహరిస్తారా'' అని ఆయన ప్రశ్నించారు. పిట్ట బెదిరింపులకు, తప్పుడు ప్రచారాలకు ఎవ్వరూ భయపడరని కేసీఆర్ అన్నారు. గౌరవ శాసనసభ్యులకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. తమిళనాడులో జయలలితలాగా అవసరం అయితే కేబుల్ చట్టాలను అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.