టీవీ 9పై కేసీఆర్ నిప్పులు
* ఎమ్మెల్యేలను ఇంతగా కించపరుస్తరా?
* పాచి కల్లు తాగిన మొహాలంటారా?
* టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూసేటోళ్లా!
* ఆ మొహాలను మల్టీప్లెక్స్‌కు పట్టుకొచ్చి కూర్చోబెట్టామంటారా?
* ఏమిటీ దురహంకారం దేనికైనా హద్దుంటుంది
* పిట్టబెదిరింపులకూ, లంగప్రచారాలకూ బెదిరిపోం
* ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు
సాక్షి, హైదరాబాద్: టీవీ-9 చానల్, ఆంధ్రజ్యోతి పత్రికపై తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనసభలో నిప్పులు చెరిగారు. శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ-9ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెగటివ్‌గా చూయించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తోందని... పనిగట్టుకుని విషం చిమ్ముతోందని మండిపడ్డారు. కేసీఆర్ ఆగ్రహం ఆయన మాటల్లోనే... ‘దేనికైనా ఒక హద్దు ఉంటుంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెలంగాణ సమాజం సమైక్య రాష్ర్టంలో వలసవాదుల అహంకారం కింద చాలా బాధ అనుభవించింది.
చాలా భయంకరమైన వివక్షకు గురైంది. భాష మీద, యాస మీద, సంస్కృతి మీద చాలా భయంకరమైన దాడి జరిగింది. అయినా మౌనంగా భరించాం. గుడ్ల నీళ్లు గుడ్లలోనే ఓపుకున్నం. కూసున్న కాడనే ఏడ్చినం. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఇంతకంటే దుర్మార్గం ఈ ప్రపంచంలో ఉంటుందా? తెలంగాణ శాసనసభ మీద, ప్రొటెం స్పీకరు జానారెడ్డిని, మంత్రివర్గ సభ్యులను, ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలను చూయించుకుంటూ టీవీ-9 అనే ఒక సంస్థ... టూరింగ్ టాకీస్‌లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్‌లల్లో కూసుండబెట్టినట్టు ఉందంట తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి. ఫుటేజ్ ఉందిప్పుడు.
నాకు ఇవ్వాళ పొద్దున దాకా తెలియదు. నిన్ననే తెలిసుంటే నేను అగ్రహోదగ్రుడయ్యేవాడిని. నిజామా, అబద్దమా అని తెలియక ఇయాళ ఫుటేజ్ తెప్పించి చూసినా. ఎవరికో ఏదో ఇస్తే... ఎక్కడో పెట్టుకున్నట్టు... ఇలా చూయించారు. ఇంకొన్ని నేనిక్కడ చెప్పలేను. శాసనసభ కొత్తగా సమావేశమైనప్పుడు శాసనసభ సంప్రదాయం ఏమిటంటే శాసనసభ రూల్స్ బుక్, భారత రాజ్యాంగం పుస్తకంతో పాటు ఒక ఐ-ప్యాడ్ ఇస్తారు. చూసి రాసిన ప్రమాణ స్వీకారం చదవలేని మొహాలకు ఐ-ప్యాడ్‌లు ఇస్తే యాడ మడిచి పెట్టుకుంటారో? ఇదో కామెంటు. తెలంగాణ శాసనసభ్యుల మొహాలు పాచి కల్లు తాగిన మొహాలంట. ఈ టీవీ-9 అనే సంస్థ మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రసారం చేసింది. ఒక దళిత అమ్మాయి...బాడిగె శోభ అని చొప్పదండి నుంచి గెలిచి వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం తడబడింది. నాకు భయమయితాంది సార్ అని నాతో ఉన్న అప్యాయతతోనే నాకు చెప్పింది. ఏం ఫరవాలేదు ధైర్యంగా వెళ్లు అని చెప్పినా. ఆ అమ్మాయి చదివింది. దీన్ని పొద్దాక చూపిస్తారా టీవీలో. తెలంగాణ శాసనసభను, శాసనసభాపతిని, మంత్రులను ఇలా చూయిస్తరా? ఇంత అహంకారమా? ఏం మాటలు? ఈ సీడీ రెడీగా ఉంది. వీటిని సర్క్యులేట్ చేస్తాను. అన్ని పార్టీలు కలిసి చూద్దాం.
విషం కక్కుతున్నారు..
తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష్య. ఒక అసూయ. తెలంగాణ రాష్ట్రం ఏట్లా ఏర్పడింది అనే న్యూనతా భావాన్ని కలిగించే ప్రయత్నం కొన్ని పత్రికలు చేస్తున్నాయి. పనిగట్టుకుని ఒక పత్రిక, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక. ప్రతీ రోజూ విషం కక్కుతోంది. కేబినెట్ మీటింగులో నేను మంత్రులకు ఆదేశాలు ఇచ్చాను. మనం మాట్లాడుకునే కొన్ని విషయాలు నిర్ణయాలు కావు. అవి బయటకు చెప్పకండి అని. డోంట్‌మేక్ లూజ్ కామెంట్స్ అని మంత్రులకు చెప్పిన. దానికి ఏం రాస్తది ఈ పత్రిక అంటే... మొహం చాటేసిన మంత్రులంట. కేబినెట్‌లో చెప్పినవి నీకు పూసగుచ్చినట్టు చెబితే చెప్పినట్టు లేకపోతే మొహం చాటేసినట్టా? ఆంధ్రా నుంచా వేసేయ్ పన్ను... 500 కోట్ల బాదుడు ఇలాంటి వార్తలను ఈ రోజు కూడా ప్రచురించింది.
లేని ఇష్యూను ఉన్నట్టు చూయించే ప్రయత్నం జరుగుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నెగటివ్ షేడ్‌లో చూయించే ప్రయత్నం చేస్తున్నరు. నేను వీరిని హెచ్చరిస్తున్నా. వీళ్లను వదిలే ప్రసక్తే లేదు. ఇది శాసనసభ గౌరవానికి సంబంధించింది. చాలా తుఫానులు చూసినం. చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నం. నేను చాలా మొండి ఘటాన్ని. ఈ పిట్ట బెదిరింపులకు, లంగ ప్రచారానికి ఎవరూ భయపడే వారు లేరిక్కడ. నా గుండె మండి చెబుతున్నా ఏం చేసినా తట్టుకుంటాం. తగిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం తరహాలో కేబుల్ వ్యవస్థను అవసరమైతే చట్టం చేసి టేకోవర్ చేస్తామని పేర్కొన్నారు.