పరారీలో రవిప్రకాశ్‌  | Ravi Prakash in absconding | Sakshi
Sakshi News home page

పరారీలో రవిప్రకాశ్‌ 

Published Tue, May 14 2019 1:24 AM | Last Updated on Tue, May 14 2019 1:18 PM

Ravi Prakash in absconding - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీవీ–9 వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసినట్లు సమాచారం. ఈ నోటీసులకు స్పందించకపోతే రవిప్రకాశ్‌ అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. ఫోర్జరీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సైబరాబాద్‌ పోలీసులు ఇప్పటికే సీఆర్‌పీసీ 160 ప్రకారం ఈనెల 9, 11వ తేదీల్లో రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన రవిప్రకాశ్‌ తాను విచారణకు హాజరు అయ్యేందుకు 10 రోజుల సమయం కావాలని లాయరు ద్వారా కోరినట్లు సమాచారం. మరో నిందితుడు, సినీనటుడు శొంఠినేని శివాజీ ఇంతవరకూ పత్తాలేడు. ఈ కేసులో మరో నిందితుడు ఎంకేవీఎన్‌ మూర్తి విచారణకు సహకరిస్తున్నారు. మూర్తిని ఇప్పటికే పలుమార్లు పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను మూర్తి పోలీసులను వివరించినట్లు సమాచారం.
 
సెక్షన్‌ 41 ప్రకారం నోటీసులు! 
ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న రవిప్రకాశ్‌కు పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం రాత్రి రవిప్రకాశ్‌ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే గతంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇవ్వగా, ఇప్పుడు సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీచేశారు. ఈనెల 9న ఒకసారి, 11వ తేదీన మరోసారి సెక్షన్‌ 160 కింద పోలీసులు నోటీసులిచ్చినా రవిప్రకాశ్, శివాజీలు ఇంతవరకూ జాడలేకుండా పోయారు. ఈ కేసులో ఇప్పటికే ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ), 72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై ప్రధానంగా ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులు నమోదయ్యాయి. కేసులో తీవ్రత ఆధారంగా పోలీసులు సెక్షన్‌ 41 ద్వారా నోటీసులు జారీ చేశారు.  

అంతుబట్టని శివాజీ వ్యవహారం 
ఈ వ్యవహారంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన నటుడు శివాజీ పాత్ర అంతుబట్టడంలేదు. టీవీ9లో 8 శాతం వాటా ఉన్న రవిప్రకాశ్‌ తనకు 2018, ఫిబ్రవరిలో 40వేల షేర్లు విక్రయించాడని, ఒప్పందం ప్రకారం తనకు ఏడాదిలోగా షేర్లు బదిలీ చేయలేదని, అలందాకు టీవీ9 విక్రయిస్తున్న విషయం కూడా తన వద్ద దాచారని ఆరోపిస్తూ శివాజీ ‘లా ఆఫ్‌ ట్రిబ్యునల్‌’ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు అన్యాయం జరిగినపుడు రవిప్రకాశ్‌పై ఫిర్యాదు చేయకుండా యాజమాన్య మార్పులను తెరపైకి తేవడం అంతా రవిప్రకాశ్‌ పథకంలో భాగమేనని అలందా మీడియా అనుమానిస్తోంది. ఇప్పుడు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినపుడు బాధితుడిగా తనకు జరిగిన అన్యాయం చెప్పుకునే అవకాశం వచ్చినా, ఎందుకు పరారీలో ఉన్నాడన్న ప్రశ్నలకు శివాజీ ఆచూకీ లభిస్తేనే సమాధానం దొరుకుతుంది.  

సెక్షన్‌ మారిస్తే ఏంటి?
సెక్షన్‌S160 ప్రకారం.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కేవలం విచారణకు మాత్రమే పిలిచే అవకాశం ఉంటుంది. అదే సెక్షన్‌ 41కి మారిస్తే.. కేసు తీవ్రత ఆధారంగా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లోనే ఈ సెక్షన్‌ని ప్రయోగిస్తారు. నిందితులు సాక్షులను ప్రభావితం చేయడం, వారిపై బెదిరింపులకు దిగడం, కీలక ఆధారాలు ధ్వంసం చేస్తారన్న అనుమానం వస్తే.. మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకుని అరెస్టు చేసే వీలుంటుంది. అందుకే, పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement