నేరరహిత నగరానికి సహకరించండి
‘‘చారిత్రాత్మక హైదరాబాద్ నగరం జనాభా 80 లక్షలు పైమాటే. ఇంత మంది ప్రజలకు 12 వేల మంది పోలీసులే ఉన్నారు. ప్రతి చోటా, ప్రతి సమయంలో ప్రజలకు రక్షణగా పోలీసులు ఉండాలంటే కష్టమే. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలంటే నగర పౌరుల సహకారం ఎంతో అవసరం. మేము యూనిఫాంలో ఉన్న పోలీసులమైతే.. మీరు యూనిఫాం లేని పోలీసులు. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. లేదా నేరం చేసిన వ్యక్తిని మీరే పట్టుకొని పోలీసులకు అప్పగించండి’
- మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి
నాంపల్లి: నాంపల్లి చాపెల్ రోడ్డులోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో శుక్రవారం తోపుడు బండ్ల వ్యాపారులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ప్రోగ్రామ్ ఆన్ సేప్టీ అండ్ సెక్యూరిటీ మే జర్స్ టు ది హాకర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాలను అరికట్టడం ఎలా అనే అంశంపై లఘు చిత్రాలను ప్రదర్శించి వ్యాపారులను, సెక్యూరిటీ సిబ్బం దిని జాగృతం చేశారు. కార్యక్రమంలో డీసీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడు. అడిషనల్ డీసీపీ టాస్క్‌ఫోర్స్ కోటిరెడ్డి, సెంట్రల్ జోన్ అడిషన్ డీసీపీ వరప్రసాదరావు, ఏసీపీలు అమరకాంత్‌రెడ్డి, మహ్మద్ ఇస్మాయిల్, జైపాల్, ఇన్స్పెక్టర్లు మధు మోహన్‌రెడ్డి, అశోక్, జగ్గారెడ్డి తదితరులు
ఆగస్టు 15న పోలీసు శాఖకు కొత్త వాహనాలు...
హైదరాబాద్‌లోని పోలీసుస్టేషన్లు న్యూయార్క్, లండన్ తరహాలో పనిచేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రూ. 300 కోట్లు వెచ్చించి, 2 వేల కొత్త వాహనాలు,3 వేల ద్విచక్రవాహనాలను కొనుగోలు చేశారని డీసీపీ కమలాసన్‌రెడ్డి చెప్పారు. ఇవి ఈనెల 15న పోలీసుస్టేషన్లకు చేరుతాయన్నారు. హై దరాబాద్ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేం దుకు కమిషనర్ మహేందర్‌రెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపడతున్నారన్నారు.
పేలుళ్లు పునరావృతమైతే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది...
తీవ్రవాదులు పేలుళ్లు జరిపేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారని డీసీపీ అన్నారు. గతంలో మక్కామసీదు, లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్, దిల్సుఖ్నగర్లలో పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు పోలీసులా వ్యవహరించి పేలుళ్లు జరగకుండా ఉండేందుకు పోలీసులకు సహకరించాలి. వ్యాపార సముదాయాలు, థియేటర్లు తదితర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, ఎవ్వరూ నేరం చేయాలంటేనే బయపడే విధంగా అమెరికా, ఇంగ్లాండ్ తరహాలో నగరంలో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
చిరువ్యాపారులకు ఎస్ఎంఎస్ అలర్ట్ సౌక ర్యం...
తోపుడు బండ్ల వ్యాపారులు, సెక్యూరిటీగార్డుల ఫోన్ నంబర్లను సేకరించాం. ఈ ఫోన్ నంబర్లను సాఫ్ట్వేర్ ద్వారా భద్రపరిచాం. వీరితో ఎలాంటి అభిప్రాయాలు పంచుకోవాలన్నా ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ అలర్ట్ చేస్తాం. తోపుడు బండ్లు, సెక్యూరిటీగార్డుల భాగస్వామ్యంతో నేరాలను అరికట్టవచ్చును. ఈ విధానం మరో 10 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది.
తీవ్రవాదుల ఊహా చిత్రాల విడుదల ...
పేలుళ్లతో సంబంధం ఉన్న తీవ్ర వాదుల ఊహాచిత్రాలను పోలీసులు తోపుడు బండ్ల వ్యాపారులు, సెక్యూరిటీ గార్డులకు అందజేశారు. వీరి వివరాలు చెప్తే రూ. 25 లక్షల రివార్డు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. వీరిలో తీవ్రవాదులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, యాసీన్ భత్కల్, అక్తర్, వాఖాస్ , అసదుల్లా అక్తర్, మోహిసీన్ చౌదరి, తౌఖీర్, అరీజ్ ఖాన్, డాక్టర్ షానావాజ్, మహ్మద్ ఖాలిద్, సాజిద్ ఖురేసీ అలియాస్ బడా సాజిద్, మిర్జా సాదబ్ బేగ్, ముద్దాసిర్ యాసిన్, అలమ్బేజ్ అఫ్రిది, అహ్మద్ మొయిన్, మౌలానా సుల్తాన్ తదితరులు ఉన్నారు. వివరాలను తెలియజేయాల్సిన ఫోన్ నంబర్లు హైదరాబాద్ కంట్రోల్ రూం 100 లేదా 9490618941, సైబరాబాద్ కంట్రోల్ రూమ్ 100 లేదా 9440700975, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మలక్‌పేట్ పీఎస్ 040-24152069 లేదా 9490616387, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సరూర్‌నగర్ పీఎస్ 040-27853903 లేదా 9490617170లలో సంప్రదించవచ్చు.