
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం బయోడైవర్సిటీ పార్క్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు(31 కిలోమీటర్ల) మెట్రో రైలు మార్గాన్ని పొడిగించే పనులు చేపట్టేందుకు వీలుగా ‘హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్’పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మెట్రో మార్గానికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) అధికారులు ఇప్పటికే ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్)కు సమర్పించింది. త్వరలో సమగ్ర ప్రాజెక్టు నివేదికను డీఎంఆర్‌సీ సిద్ధం చేయనుంది. ఈ మార్గంలో మెట్రో స్టేషన్లకు సమీపంలో నూతన టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎస్‌పీవీలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు 51 శాతం వాటా, హెచ్‌ఎండీఏకు 49 శాతం వాటాలు దక్కనున్నాయి. ఈ ఎస్‌పీవీ ప్రధానంగా ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో మార్గానికి సంబంధించిన ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, మెట్రో మార్గాన్ని పరీక్షించడం, నిధుల సమీకరణ వంటి పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఎస్‌పీవీ ఆధ్వర్యంలో మెట్రో మార్గంలో ప్రత్యేక టౌన్‌షిప్‌లు, షాపింగ్‌మాల్స్, వాణిజ్య కాంప్లెక్స్‌ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు కల్పించే పనులను చేపట్టనుంది. మెట్రో మార్గంలో ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ప్రధాన రహదారుల విస్తరణ, రవాణా ఆధారిత అభివృద్ధి పనులతోపాటు ప్రజారవాణా వ్యవస్థల అభివృద్ధి తదితర పనులను చేపట్టనుంది. ఎస్‌పీవీ లిమిటెడ్‌లో ప్రాథమికంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి పేరిట 5.10 లక్షల ఈక్విటీ షేర్లు, 4.89 లక్షల ఈక్విటీ షేర్లను హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు పేరిట కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌పీవీలో ప్రభుత్వం తరఫున నియమించిన ఇతర డైరెక్టర్లకు పది చొప్పున ఈక్విటీ షేర్లు కేటాయించారు.
సారథులు వీరే..
హెచ్‌ఏఎంఎల్ ఎస్‌పీవీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్వీఎస్‌రెడ్డి వ్యవహరిస్తారు. డైరెక్టర్లుగా కె.రామకృష్ణారావు(ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి), సునీల్‌శర్మ(ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి), అరవింద్‌కుమార్(మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి), జయేశ్‌రంజన్(ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి), టి.చిరంజీవులు(హెచ్‌ఎండీఏ కమిషనర్).
Comments
Please login to add a commentAdd a comment