రాయల వారి వారసుడొచ్చాడు..
- 19వ వారసుడు శ్రీకృష్ణదేవరాయలు
మియాపూర్: శ్రీకృష్ణదేవరాయల వారి వారసుడొచ్చారు. సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో 19వ వారసుడు శ్రీకృష్ణదేవరాయలు ముందుకు వచ్చారు. కర్ణాటకలోని ఆనేగుంధే గ్రామం వసపేటలో నివాసం ఉంటున్నారు. ‘ఆనేగుంధే’ అనే ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
గురువారం మియాపూర్‌లోని జయప్రకాశ్ నారాయణనగర్‌లో గుత్తి నారాయణరెడ్డి సాహితీ పీఠం ఆధ్వర్యంలో గుత్తి చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తాతగారైన శ్రీకృష్ణదేవరాయల పాలన, చరిత్రను దశదిశలా వ్యాపింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాయల సామ్రాజ్యనికి నాడు వృత్తి పరంగా అప్పటి ప్రజలకు ఎంతో కృషి చేశారని కొని యాడారు. ప్రజలతో రాయలవారు మైత్రీగా ఉండేవారని తమ పూర్వీకులు చెబుతుండేవారని తెలిపారు.
అనంతరం సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల చరిత్రను ఈ తరం ఉపాధ్యాయులు మరుగున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి రచించిన శ్రీకృష్ణదేవరాయలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవులు, కళాకారులకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కళాకారులు ప్రభాకర్‌రెడ్డి, నిషాపతి, సోమయాజులు, పరమశివమూర్తి, కోక విజయ లక్ష్మి, గోపాల్‌రెడ్డి, రామకృష్ణరావు, లలితాంభిక పాల్గొన్నారు.