Krishnadevaraya
-
అక్షర పాలకులు
రాజ్యాలు, వైభవాలు ఉన్నాయి కదా అని పొద్దంతా విలాసాల్లో మునిగి తేలితే గొప్పేముంది? జనం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి ఆలోచనే కొందరు పాలకులకు చరిత్రలో ప్రత్యేక పేజీలను కేటాయించింది. రాచరికాలు కావచ్చు, ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు... పాలనా దక్షత ఒక్కటే ఉంటే పాలకుడిగానే మిగిలిపోతారు. పాలనతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వెలిగిపోతారు. చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ప్రజారంజకంగా పాలించారు. కొందరు ప్రజాకంటక పాలన అందించి కాలగర్భంలో కలిసిపోయారు. చాలా కొద్దిమంది మాత్రం మంచి పాలన అందించడంతో పాటు ‘కూసింత కలాపోసన’ చేసి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి సాహితీ పాలకుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలే! ప్రజాసంక్షేమ పాలనకు పెట్టింది పేరు అయిన కృష్ణదేవరాయల హయాంలో సాహిత్యానికి పట్టం కట్టారు. ‘భువన విజయం’ పేరుతో అష్ట దిగ్గజ కవులను కొలువు తీర్చిన కృష్ణదేవరాయలు వారికి ఏమాత్రం తీసిపోకుండా తానూ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. తెలుగు, కన్నడ, తుళు, తమిళ భాషలతో పాటు సంస్కృతంలోనూ రాయలు పండితుడు. సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలస చరితం, రసమంజరి వంటి గ్రంథాలు రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అను గోదాదేవి కథ అన్న అద్భుత కావ్యాన్ని జాతికి కానుకగా ఇచ్చాడు. భారత దేశపు చివరి చక్రవర్తిగా నిలిచిపోయిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ అద్భుతమైన సూఫీ కవి. ఉర్దూభాషా పండితుడైన బహదూర్ షా కలం పేరు జఫర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మీర్జా గాలిబ్, ఇబ్రహీం జౌఖ్... బహదూర్ షా ఆస్థానంలోని కవులే. బ్రిటిష్ పాలకులు తనను బర్మాలో నిర్బంధించినప్పుడు, తన నిస్సహాయతను దృష్టిలో ఉంచుకుని బహదూర్ షా రాసిన ‘నా కిసీకీ ఆంఖోం కా నూర్ హూం’ అనే గజల్ ఇప్పటికీ కచ్చేరీలలో మార్మోగుతూ ఉంటుంది. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన విన్స్టన్ చర్చిల్ అద్భుతమైన రచయిత. సైద్ధాంతికంగా చర్చిల్‌ను ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు; ఆయన రచనల్లోని ఆలోచనలనూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన శైలిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించి ఎన్నో కీలక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన చర్చిల్ తిరుగులేని చమత్కారి కూడా! బ్రిటన్ను పాలించిన ప్రధానులందరిలోకీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చర్చిల్ రచయితగా నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాహితీ పిపాసి. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను రాసిన నెహ్రూను ‘పొయట్ ఎట్ హార్ట్’ అని ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తించారు. ఆ ఒక్కముక్క చాలదూ... నెహ్రూ మంచి రచయిత అనడానికి! చైనాను సుదీర్ఘ కాలం పాలించిన మావో జెడాంగ్ కవులు మెచ్చిన రొమాంటిక్ పొయెట్. వియత్నాం విప్లవ యోధుడు హోచిమన్ కవిత్వం అత్యంత సహజంగా ఉంటుందని పండితులే మెచ్చుకున్నారు. భారత ప్రధానుల్లో నెహ్రూ తర్వాత పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయ్ సాహితీ స్రష్టలే. భావోద్వేగాలు, భావావేశాలు కలగలిసిన వాజ్‌పేయ్ కవితలు కదం తొక్కిస్తాయి. అలాగని పీవీ తక్కువ వాడేమీ కాదు. పండితులకే కొరకరాని విశ్వనాథ ‘వేయిపడగల’ను హిందీలోకి అనువదించిన మేధావి. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో వెలిగిన గిరిధర్ గమాంగ్ సకల కళావల్లభుడే. గిరిజన సంగీతం గొప్పతనాన్ని యావత్ లోకానికీ చాటి చెప్పాలన్న కసితో దశాబ్దాల తరబడి కృషి చేసిన గమాంగ్ స్వతహాగా అద్భుత సంగీతకారుడు. రక రకాల గిరిజన సంగీత వాద్య పరికరాలు వాయించడంలో పండితుడు. ఒరియాలో మంచి కవి. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన మఖ్దూమ్ మొహియుద్దీన్ నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు, అనంతరం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. విశ్వ విఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా రాసిన ఓ నాటకాన్ని మఖ్దూమ్ ఉర్దూలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఆసక్తిగా వీక్షించిన రవీంద్రుడు ఆనందం పట్టలేక వేదికపైనున్న మఖ్దూమ్‌ను కౌగలించుకున్నాడు. మఖ్దూమ్ రచనలను ప్రముఖ రచయిత గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఒకప్పుడు మంచి సాహిత్యాన్ని అందించిన పాలకులు ఉండేవారు. ప్రపంచం అసూయతో రగిలిపోయేంత పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇçప్పుడు అటువంటి అక్షర పాలకులు లేరు. మంచి కవిత్వమో, కథో రాయడం మాట దేవుడెరుగు... నేడు పలువురు పాలకులకు మంచి పుస్తకం ఇస్తే కనీసం చదవలేని దుఃస్థితి. మళ్లీ నిరుటి మెరుపులు కొత్త వెలుగులు కాయిస్తాయనీ, నిరుడు మురిపించిన హిమసమూహాలు చల్లటి కబురందిస్తాయనీ ఆశిద్దాం. గతం వలె మళ్లీ సాహితీ కుసుమాలు వికసిస్తాయని కాంక్షిద్దాం. -
పోలవరంపైనోటీస్ ఇచ్చిన ఎంపీ కృష్ణదేవరాయలు
-
ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు లక్ష్యం
-
టీడీపీ స్క్రిప్టు ప్రకారమే: శ్రీకృష్ణ దేవరాయలు
-
రాయల వారి వారసుడొచ్చాడు..
19వ వారసుడు శ్రీకృష్ణదేవరాయలు మియాపూర్: శ్రీకృష్ణదేవరాయల వారి వారసుడొచ్చారు. సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో 19వ వారసుడు శ్రీకృష్ణదేవరాయలు ముందుకు వచ్చారు. కర్ణాటకలోని ఆనేగుంధే గ్రామం వసపేటలో నివాసం ఉంటున్నారు. ‘ఆనేగుంధే’ అనే ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గురువారం మియాపూర్‌లోని జయప్రకాశ్ నారాయణనగర్లో గుత్తి నారాయణరెడ్డి సాహితీ పీఠం ఆధ్వర్యంలో గుత్తి చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తాతగారైన శ్రీకృష్ణదేవరాయల పాలన, చరిత్రను దశదిశలా వ్యాపింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాయల సామ్రాజ్యనికి నాడు వృత్తి పరంగా అప్పటి ప్రజలకు ఎంతో కృషి చేశారని కొని యాడారు. ప్రజలతో రాయలవారు మైత్రీగా ఉండేవారని తమ పూర్వీకులు చెబుతుండేవారని తెలిపారు. అనంతరం సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల చరిత్రను ఈ తరం ఉపాధ్యాయులు మరుగున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి రచించిన శ్రీకృష్ణదేవరాయలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవులు, కళాకారులకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కళాకారులు ప్రభాకర్‌రెడ్డి, నిషాపతి, సోమయాజులు, పరమశివమూర్తి, కోక విజయ లక్ష్మి, గోపాల్‌రెడ్డి, రామకృష్ణరావు, లలితాంభిక పాల్గొన్నారు. -
పద్యానవనం: సమయస్ఫూర్తితోనే కవికి కీర్తి!
రంజన జెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా! సంజాతమేమి చెప్పుదు కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్! ఏనుగుల సమూహము దోమ కుత్తకలో జొచ్చింది! అన్న అసాధారణ విషయాన్ని, ‘‘కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్’’ అనే సమస్యాపూరణంగా ఇచ్చారు ప్రాజ్ఞులు సభలో. దానికి, సరసకవి తెనాలి రామకృష్ణుడు ఏ మాత్రం తడుముకోకుండా, సాహితీ సమరాంగన సార్వభౌముడైన కృష్ణదేవరాయల సమక్షంలో పై విధంగా పూరించాడు. మహాపరాక్రమవంతులైన పాండవులు తలరాత బాగోలేక సాదాసీదా విరాటరాజును కొలిచే స్థితికి వచ్చారు. విధి ఎంత బలీయమైనదో చెప్పజాలమంటూ, ఏనుగుల సమూహం దోమ గొంతుకలో జొచ్చిందనే పోలికచెప్పడమన్నమాట! అవధాన ప్రక్రియల్లో తరచూ జరిగేదే కదా! ఇందులో సరసమేముంది? విశేషమేముంది? అనిపించవచ్చు. కానీ, విషయం ఇది మాత్రమే కాదు. తన సరస-సమర్థ హాస్య, సాహితీ ప్రతిభతో ప్రతిసారీ రాయలవారి వద్ద మార్కులు కొట్టేసే రామకృష్ణ కవిని ఎలాగైనా దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల ఆటలు సాగకపోవడం ఇందులో విశేషం. విచిత్రమైన సమస్యనిచ్చి, సమస్యాపూరణం చేయాల్సిందిగా అంతఃపురంలో సేవకుడిగా ఉండే ఒక పరిచారకుడితో రామకృష్ణ కవిని అడిగిస్తారు అతనంటే ఈర్ష్య కలిగిన వారు. ఏం చెబుతాడో చూద్దామన్నది ఉత్సుకత. తాము తెరవెనుక ఉండి గోప్యంగా ఇదంతా నడిపిస్తారు. అడిగేవాడిని బట్టి రామకృష్ణుడు ఎలాగూ పెడార్థమొచ్చే పూరణమే చేస్తాడు, ఒకడుగు ముందుకేసి బూతులు మాట్లాడినా మాట్లాడొచ్చు! అప్పుడు సభలో రాజుగారి ముందు ఇదే సమస్యనిచ్చి పూరించమంటూ రామకృష్ణ కవిని ఇబ్బందుల్లో పెట్టాలన్నది వారి ఎత్తుగడ. అనుకున్నట్టుగానే వారి అంచనా కొంతమేర నిజమైంది. సహజంగానే రామకృష్ణకవి విపరీతంగా స్పందించాడు. ‘అయ్యవారూ, ఇదుగో ఈ సమస్యను మీరు పూరించగలరా!’ అని, తెలిసీ తెలియక సేవకుడడిగినపుడు, ‘ఆ... దానికేం భాగ్యం’ అంటూ, ‘‘గంజాయి తాగి, తురకల సంజాతము తోడ కల్లు చవిగొన్నావా? లంజల కొడుకా ఎక్కడ కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చెన్?’ అని తిడుతూ కందపద్యంతో సమస్యా పూరణం చేశారు రామకృష్ణుడు. నాటి పదిహేనో శతాబ్ద కాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణాది వైపు విస్తరిస్తున్న బహమనీ సుల్తానుల హయాంలో ఆ తురుష్కుల సేవకులు, పరివారం గంజాయితో పాటు కల్లును మత్తుపానీయంగా సేవించేవారు. వారితో కూడి తాగి ఉన్నావా? అని తిడుతూ, ఎక్కడరా! ఎక్కడ, ఏనుగుల సమూహమెక్కడైనా దోమ కుత్తుకలో జొరబడగలదా? ఎక్కడ చెప్పు! అన్న అర్థం వచ్చేలా మందలిస్తూ సమస్యా పూరణం చేస్తాడు. పాపం, దానర్థం తెలియని సేవకుడు యధాతథంగా తీసుకువెళ్లి, వ్యూహకర్తలకు అప్పజెప్పాడు. ‘ఆహా! అనుకున్నంతా అయింది, మన రొట్టె విరిగి నేతిలో పడింది, ఇక ఇదేదీ జరుగనట్టు గుంభనంగా ఉండి, నిండు సభలో రాజుగారి ముందు రామకృష్ణుడికి ఇదే సమస్యనిస్తే... అయ్యో ఎంత పనిచేశానని ఆయన నాలుక్కరచుకోవడం ఖాయమ’ని సంబరపడ్డారు. తర్వాతి రోజు ఏమీ తెలియనట్టు సభలో ఓ సందర్భం సృష్టించి, ‘ఇదుగో ఈ సమస్యను రామకృష్ణుడైతే ఎలా పూరిస్తాడో అడగండి మహారాజా!’ అని, అదే సమస్యను సభ ముందుంచారు. నిన్నటి సంఘటనను గుర్తుకు తెచ్చుకొని, క్షణాల్లో విషయం గ్రహించిన తెనాలి రామకృష్ణుడు అప్పటికప్పుడు ఆశువుగా పైన పేర్కొన్న స్కీమ్-2 పద్యం సృష్టించారు. ఆయన ప్రతిభకు అబ్బురపడి, అభినందించారట కృష్ణదేవరాయలు. ఎప్పటిలాగే ప్రశంసలు తెనాలి రామకృష్ణుడికి, భంగపాటు ప్రత్యర్థులకు. అదీ సమయస్పూర్తి. - దిలీప్‌రెడ్డి