లంకకు ఇప్పట్లో వద్దు బాబోయ్‌ ..! | Sri lanka Bomb Blast Effect on Hyderabad Tourism | Sakshi
Sakshi News home page

లంకకు ఇప్పట్లో వద్దు బాబోయ్‌ ..!

Published Tue, Apr 23 2019 6:33 AM | Last Updated on Fri, Apr 26 2019 11:54 AM

Sri lanka Bomb Blast Effect on Hyderabad Tourism - Sakshi

సాక్షి,సిటీబ్యూరో:  శ్రీలంకలో బాంబు పేలుళ్లు హైదరాబాద్‌ వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. అక్కడ బాంబుపేలుళ్లతో భాగ్యనగర వాసులకు ఏం సంబంధం ఉందంటారా? ప్రతివారం గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి శ్రీలంక వెళ్లేవారి సంఖ్య వందల్లో ఉంటుంది. వీరంతా శని, ఆదివారాల్లోనే శ్రీలంకకు వెళుతుంటారు. శ్రీలంక అందాలను చూసేందుకు పర్యాటకులుగా వెళ్లే వారు కొందరైతే.. అక్కడ క్యాసినోల్లో జూదం ఆడి కోట్లు సంపాదించేద్దామని వెళ్లేవారు ఇంకొందరు. వ్యాపారపరంగా వెళ్లేవారు మరికొందరు. ఈ మూడు కోవకు చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. శ్రీలంకలోని సిన్నామన్‌ గ్రాండ్, షంగ్రీలా హోటళ్లతో పాటు పలు ప్రాంతాలు ఆదివారం బాంబుల మోతతో దద్దరిల్లాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. అదృష్టవశాత్తు ఈ పేలుళ్లలో హైదరాబాద్‌వాసుల ఎవ్వరూలేకపోవడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు.

శ్రీలంకే ఎందుకు..?
నగరానికి చెందిన వారు గతంలో ఎక్కువగా గోవా వెళ్లేవారు. అయితే ప్రస్తుతం గోవాతో పోల్చుకుంటే శ్రీలంకలో వ్యాసినోలకు వెళ్లడం చౌకగా మారింది. అదీకాక హైదరాబాద్‌ నుంచి పొద్దున్నే విమానం ఎక్కితే గంటన్నరలో శ్రీలంకలో ల్యాండ్‌ అవుతారు. అక్కడ ఓ పూట క్యాసినోల్లో గడిపి మర్నాడు ఉదయమే ఇంటికి తిరిగి వచ్చేలా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. టికెట్‌ ధరలు కూడా తక్కువే. దీంతో  హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాసులు ఎక్కువగా శ్రీలంక వైపు ఆకర్షితులు అవుతున్నారు.

పేరు చెబితేనే బెంబేలు...
శ్రీలంకలోని  క్యాసినోల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు జూదప్రియులు నగరం నంచి వెళుతుంటారు. నగరంలోని ట్రావెల్‌ ఏజెంట్ల లెక్కల ప్రకారం.. హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నెలకు సుమారు 600 మందికి పైగా శ్రీలంక వెళుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం క్యాసినోల్లో ఆడేందుకే వెళ్లేవారే. తాజా దుర్ఘటనతో కొన్ని రోజులపాటు శ్రీలంక వైపు వెళ్లేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు వెనుకంజ వేస్తారని ట్రావెల్‌ ఏజెంట్‌ ఒకరు చెప్పారు. తెలంగాణతో పాటు కర్నూల్‌ జిల్లా నుంచి కూడా శ్రీలంక వెళ్లే జూదప్రియుల సంఖ్య రెండుమూడేళ్ల నుంచి బాగా పెరిగిందని తెలిపారు. నగరానికి చెందిన జూదప్రియులను ఆకర్షించేందుకు శ్రీలంకలోని క్యాసినో నిర్వాహకులు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మార్కెంటింగ్‌ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉచిత విమాన టికెట్లు, బస పేరుతో జూదప్రియులను ఆకర్షించి తీసుకెళుతున్నారు. అక్కడ క్యాసినోల్లో అడుగుపెట్టేందుకు తక్కువలో తక్కువ రూ. 2 లక్షలు ఉండాల్సిందే. ఈ కారణంగానే క్యాసినో నిర్వాహకులకు ఉచిత ఎర వేస్తున్నారు. ఇక్కడ జూదరులను ఆకర్షించి శ్రీలంకకు తీసుకెళ్లడం అక్కడ క్యాసి నోల్లో జూదం ఆడించి ఉన్నదంతా ఖాళీ చేసి తిరిగి వారినిక్షేమంగా పంపడం చేస్తున్నారు. శ్రీలంకలోని క్యాసినోల్లో ఆడేందుకు వెళుతున్న వారిలో చోటా వ్యాపారుల మొదలు డాక్టర్లు, ఇంజినీర్లు, బడా వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement