కల్యాణం జరిపిస్తున్న అర్చకులు పట్టువస్త్రాలు అందిస్తున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇల్లందకుంటలో సీతారాముల కల్యాణం తిలకిస్తున్న భక్తులు
ఇల్లందకుంట(హుజూరాబాద్): అపర భద్రాద్రి ఇల్లందకుంటలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఉదయాన్నే ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. స్వామి వారిని ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేడుకల్లో మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రభుత్వం తరఫున కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఈవో సుదర్శన్ స్వామివారికి సమర్పించిన పట్టు వస్త్రాలను పూజారులు ఉత్సవ మూర్తులకు అలంకరించారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి మేళతాలాలతో తీసుకొచ్చారు.
అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, శేషం సీతారామాచార్యులు వేదమంత్రోశ్ఛారణ మధ్య కల్యాణం తంతు ప్రారంభించారు. మొదట స్వామివారికి యజ్ఞోపవీతం చేయించారు. అభిజిత్ లగ్న సుముహూర్తమున మధ్యాహ్నం 12:30 గంటలకుసీతారాములకు జీలకర్రబెల్లం కార్యక్రమాన్ని జరిపించారు. వేలాది మంది భక్తుల శ్రీరామానామ స్మరణ మధ్య రామయ్య సీతమ్మవారికి తాళి కట్టారు. నేత్రపర్వంగా సాగిన ఈ వేడుకను తిలకించిన భక్తజనం పులకించిపోయారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది.
ప్రముఖుల హాజరు..
ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి జిల్లాలోని అందరు అధికారులు హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడకలకు హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్–జమున దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, ప్యాట రమేష్, తుమ్మేటి సమ్మిరెడ్డి, సర్పంచ్ కంకణాల శ్రీలత, ఎంపీటీసీ రామ్‌స్వరణ్‌రెడ్డి, రాష్ట్ర సహకార సంఘూల అధ్యక్షుడు తక్కళ్లపల్లి రాజే«శ్వర్‌రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పింగిళి రమేశ్, చుక్కా రంజిత్, దేశిని కోటి, ఎంపీపీ గంగారపు లత, జెడ్పీటీసీ అరుకాల వీరశలింగం, రామ్ నర్సింహారెడ్డి, జిల్లా వైద్యధికారి రామ్‌మనోహర్‌రావు, తదితరులు హాజరై పూజలు చేశారు.
భారీగా బందోబస్తు..
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే బైపాస్ రూట్‌లలో వాహనాలను మళ్లించారు. వీఐపీ పాసులు ఉన్నప్పటికీ భక్తుల అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు కొంత మందిని అడ్డుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రొటోకాల్ ప్రకారం ముందు అనుకున్న ప్రకారమే మంత్రులు, ఎమ్మెల్యేలతో కొంత మందిని మాత్రమే లోపలికి పంపించి మిగతా వారిని ఆపివేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కల్యాణం వేడుకలు సజావుగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మహా అన్నదానం..
శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. వేడుకలకు హాజరైన భక్తులకు జమ్మికుంట రైస్ మిల్లర్స్, కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యాక్రమం నిర్వహించారు. అందరికీ సరిపడా భోజనాలు చేయించారు. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
సామాజిక సేవ..
వేసవి కాలం కావడం, ఎండ ఎక్కువగా ఉండడంతో ఇల్లందకుంట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ముందస్తుగానే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా సంస్థ, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు కళ్యాణ మండపంలో మంచి నీటిని, మజ్జిగను పంపిణీ చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మజ్జిగ ట్యాంకర్‌ను పంపించగా, ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాగునీరు సరఫరా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment