ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్ : త్వరలో రాష్ట్ర రాజధానిలో నీరా స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో త్వరలో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఏర్పాటు చేసేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం బేగంపేట పర్యాటక భవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నీరా పానీయాన్ని జనానికి చేరువ చేస్తామని గతంలో ప్రభుత్వాలు పేర్కొన్నా.. మాట నిలబెట్టుకోలేదని, గీత కార్మికుల సంక్షేమ చర్యల్లో భాగంగా నీరా విక్రయించే స్టాళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. ఆరోగ్య ప్రదాయిని అయిన నీరా వల్ల సాధారణ ప్రజలకు మేలు కలగటమే కాకుండా, దాన్ని విక్రయించే స్టాళ్ల ఏర్పాటుతో గీత కార్మికులకు ఉపాధి మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ స్టాళ్ల బాధ్యతను గౌడ కులస్తులకే అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు గౌడ కులస్తుల పక్షాన కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నో ఔషధ గుణాలు
నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి చెప్పారు. కంబోడియా, ఆఫ్రికాలోని పలు దేశాలు, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంకలో దీని ఉత్పత్తి ఎక్కువగా ఉందని, ఇప్పుడిప్పుడే అమెరికాలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేరళ, మహారాష్ట్రల్లో నీరా విక్రయాలున్నాయని, తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టాల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. అన్ని కులాల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నామని, హైదరాబాద్‌లో ఆయా కులాలకు సంక్షేమ భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment