రాష్ట్రంలో ఐఐఎం ప్రారంభించండి
- కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరిన మంత్రులు కడియం, కేటీఆర్
- హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి..
- నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని వినతి
- చట్ట ప్రకారం అన్ని సంస్థలు ఏర్పాటు చేస్తాం: జవదేకర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రులు కడియం శ్రీహరి, కె.తారకరామారావు కోరారు. సోమవారం జవదేకర్‌ను ఆయన కార్యాలయంలో కలసిన కడియం, కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్.. హైదరాబాద్ కేంద్రంగా ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 21 జిల్లాల్లో నవోదయ, 14 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, వరంగల్ కేంద్రంగా ప్రాంతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం 525 గురుకుల పాఠశాలల కోసం ఏటా రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని, ఈ విషయంలో కేంద్రం కూడా సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్య అందించాలన్నారు. సాను కూలంగా స్పందించిన జవదేకర్.. చట్ట ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన అన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు కడియం తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన కడియం శ్రీహరి.. విమానాశ్రయం నుంచి మెట్రో రైలులో శివాజీ స్టేడియం స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్లారు.
సిరిసిల్లలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి
సిరిసిల్ల నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ విషయమై దత్తాత్రేయను ఆయన కార్యాలయంలో కేటీఆర్ కలుసుకుని చర్చించారు. సిరిసిల్లలో ఎంత మంది కార్మికులు బీమా పరిధిలోకి వస్తారో నివేదిక పంపాలని స్థానిక కార్మిక శాఖ అధికారులను ఆదేశించినట్టు దత్తాత్రేయ తెలిపారు. బీడీ, నిర్మాణ రంగ కార్మికులు, అసంఘటిత కార్మికులు బీమా పరిధిలోకి వచ్చేలా చూడాలని సూచించినట్లు తెలిపారు. నివేదిక అందిన వెంటనే ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బీడీ కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ తరఫున ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.
దీనిపై స్పందించిన దత్తాత్రేయ.. మొదటి దశలో ఐదు వేల ఇళ్లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాటాను విడుదల చేస్తే 2018–19 నాటికి పరిశ్రమను ప్రారంభిస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి హైదరాబాద్‌లో అవసరమైన 45 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కృషి చేయాలని దత్తాత్రేయను కేటీఆర్ కోరారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణాల పథకం అమలు వేగంగా జరుగుతుండడంపై కేటీఆర్‌ను దత్తాత్రేయ అభినందించి సత్కరించారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే నిర్ణయం
విభజన చట్ట ప్రకారం రాష్ట్రంలో బయ్యా రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సోమవారం బీరేంద్రతో ఢిల్లీలో సమావేశమై చర్చించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల యువతకు పెద్ద ఎత్తు న ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ లోని బైలడైల ఐరన్‌ఓర్ మైన్స్‌కు లింక్ చేస్తూ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. గతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని సెయిల్ కమిటీ నివేదిక ఇచ్చిందని బీరేంద్ర తెలి పారు. తాను ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశానన్నారు. కమిటీ తుది నివేదిక అందాక హైదరాబాద్‌లో సమావే శమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.