మెదక్‌లో ఓటరు స్లిప్పును అందజేస్తున్న బీఎల్‌ఓ
మెదక్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో అవసరమైన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారుల నియామకం, పోస్టల్ బ్యాలెట్ల సరఫరా, ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే ప్రకటించారు. తాజాగా 28న జిల్లాకు సంబంధించిన ఓటర్ స్లిప్ (పోల్ చీటీ)లను కూడా సరఫరా చేశారు.
ఈ మేరకు బూత్ లెవల్ అధికారులు, సిబ్బంది పోల్‌చీటీలను గురువారం నుంచి డిసెంబరు 3వ తేదీ వరకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. ఓటరుకు ఎన్నికల సంఘం అందజేసే ఈ పోల్ చీటీలో ఓటరు ఫొటో, పేరు, చిరునామా, వయస్సు, గ్రామం, నియోజకవర్గం, జిల్లా తదితర వివరాలు పొందుపరిచిఉంటాయి. ఇప్పటికే పంపిణీ ప్రక్రియను బీఎల్‌ఓలు పలు గ్రామాలు, పట్టణాల్లో ప్రారంభించారు. రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,97,999 మంది ఓటర్లున్నారు.
మెదక్ నియోజకవర్గంలో 1,95,649 మంది, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,02,350 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో మాత్రం ఓటరు స్లిప్పుల వెనుక బూత్ లెవల్ అధికారుల పేర్లు, వారు చేపట్టాల్సిన విధులు, ఫోన్ నంబర్లతో పాటు పోలింగ్ స్టేషన్ రూట్ మ్యాప్‌ను సైతం ఈసారి ప్రయోగాత్మకంగా ముద్రించారు. దీంతో ఓటర్లకు ఏదైనా అనుమానం వస్తే నివృత్తి చేసుకునేలా, తమ పోలింగ్ కేంద్రం తెలుసుకునేందుకు వీలుంటుంది.
జాగ్రత్తలు తీసుకోవాలి..
పోలింగ్ చీటీల పంపిణీ బాధ్యతను ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండే బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ)లకు అప్పగించింది. ఈ పంపిణీ ప్రక్రియను ఈనెల 3వ తేదీలోగా పూర్తయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం సిబ్బందికి పూర్తి సూచనలు, సలహాలు, ఆదేశాలను జారీ చేసింది. ఈ ఓటరు స్లిప్పులను కుటుంబ సభ్యులకు మాత్రమే అందచేయాలనే స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో జాగ్రత్తగా పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంత మంది ఓర్లు ఉన్నారు... తమకు ఎన్ని ఓటరు స్లిప్పులు తెచ్చుకోవాలి, వాటిని ఎలా పంపిణీ చేయాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు.
ఓటరు స్లిప్పులను బల్క్‌గా పంపిణీ చేస్తే సంబంధిత బీఎల్‌ఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని, డూప్లికేట్ ఓటరు స్లిప్పులు తయారు చేసి పంపిణీ చేపడితే కేసులు పెడతామని ఎన్నికల సంఘం ఇప్పటికే హెచ్చరించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటర్లకు సకాలంలో ఓటరు స్లిప్పులను సరఫరా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఓటరు స్లిప్పులను సకాలంలో పంపిణీ చేయకపోతే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సహకారం తీసుకోవాలనే ఆలోచనలో యంత్రాంగం ఉంది.
రెండు రోజుల్లో పూర్తి చేస్తాం
జిల్లాకు ఓటరు స్లిప్పులు రెండు రోజుల క్రితం వచ్చాయి. ఈ మేరకు వాటన్నింటినీ ఇప్పటికే బూత్‌లెవల్ అధికారులకు పంపిణీ చేశాం. వారు ఇంటింటికీ వెళ్ళి పంపిణీ చేస్తారు. ఇప్పటికే జిల్లాలో పంపిణీ ప్రక్రియ ప్రారంభించాం. మరో రెండు రోజుల్లో మొత్తం పంపిణీ పూర్తి చేస్తాం. ఎన్నికల రోజున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టాం –నగేశ్, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment