
ఐదు లక్షల పెన్షన్ల కోత!
బోగస్‌ల తొలగింపుపై సర్కారు కసరత్తు
ఇప్పటికే అంచనాలను మించిన దరఖాస్తులు
నిబంధనల ప్రకారం భారీగా వడపోతకు నిర్ణయం
వచ్చే నెల 8 నుంచి గుర్తింపు కార్డుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల పెన్షన్లకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న 31.67 లక్షల పెన్షన్లలో ఆ మేరకు బోగస్ పెన్షనర్లు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తాజా దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య ఇప్పటికే ప్రస్తుత పెన్షన్ల సంఖ్యను దాటిపోవడం గమనార్హం. అయితే కొత్త నిబంధనలతో చాలా మందిపై అనర్హత వేటు పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆధార్ కార్డుతోపాటు సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన అంశాలను ఆధారం చేసుకుని పెన్షన్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కారు భావిస్తోంది. పిల్లలు ఉద్యోగం చేస్తున్నా, ఇతర పెన్షన్లు పొందుతున్నా, వ్యాపారాలున్నా, నాలుగు చక్రాల వాహనాలున్నా, పరిమితిని మించి భూమి ఉన్నా.. అనర్హులుగా ప్రకటించే అవకాశముంది. భార్యాభర్తలిద్దరూ వృద్ధులైతే ప్రస్తుతమున్న విధంగా ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలన్న నిబంధనను కూడా కొనసాగించనున్నారు.
అయితే ఒక ఇంట్లో వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నప్పటికీ వారందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డులు లేని కారణంగా ఇప్పటికే నాలుగున్నర లక్షల మందికి పెన్షన్లను ఆపేశారు. ఇలా ఎందుకు చేశారంటూ పెన్షన్లు కోల్పోయిన వారెవరూ తమను అడగడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగున్నర లక్షల బోగస్ పెన్షనర్లను గుర్తించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల పెన్షన్లను తొలగించిన విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.
కాగా, కొత్త పెన్షన్లు, కార్డులను వచ్చే నెల 8 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెబిట్/క్రెడిట్ కార్డుల మాదిరిగా స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. లబ్ధిదారుల ఫొటోతోపాటు వారి వివరాలతో కూడిన చిప్‌ను అమర్చాలని భావిస్తున్నారు. అయితే వాటిని లబ్ధిదారులు సరిగా భద్రపరుచుకునే అవకాశం ఉండదని, అందువల్ల కార్డుల పరిమాణం కాస్త పెద్దగా ఉండాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నట్లు సమాచారం. దీంతో పాత తరహాలో పుస్తక రూపంలో, మడతపెట్టడానికి వీలుగా ఉన్న ప్రస్తుత కార్డులుగా, స్మార్ట్ కార్డు రూపంలో ఇలా మూడు రకాల కార్డుల నమూనాలను అధికారులు రూపొందించారు. వీటిలో ముఖ్యమంత్రి ఆమోదించిన తరహా కార్డులనే అధికారులు పంపిణీ చేయనున్నారు.