సభ్యత్వం ఇంతేనా..?
కాంగ్రెస్ నేతల అలసత్వంపై కుంతియా ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు తీరుపై ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు తీరుతెన్నులపై కుంతియా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, డీఎస్, పొన్నాలతో పాటు ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యం గా పెట్టుకున్నామని పేర్కొంటూ... సభ్యత్వ వివరాలను పార్టీ ప్రధా న కార్యదర్శి సి.జె.శ్రీనివాస్ వివరించారు. దీనిపై స్పందించిన కుంతియా... ‘‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ సభ్యత్వానికి విస్తృత ఆదరణ వస్తుందని సోనియాగాంధీ ఆశావహంగా ఉన్నారు. కానీ సభ్యత్వ పరిస్థితిని చూస్తే లక్ష్యంలో సగానికి కూడా చేరుకోలేదు. ఎందుకిలా జరుగుతోంది? సభ్యత్వ నమోదుపై ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు..’’ అని ప్రశ్నించారు.
అనంతరం కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలసి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు పరిస్థితిని సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సమీక్ష సందర్భంగా పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయలోపాన్ని పలువురు ప్రస్తావించారు. ఖమ్మం జిల్లా సమీక్ష సందర్భంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.. వారి జిల్లాలో సభ్యత్వం ఎక్కువగానే జరిగినా, గాంధీభవన్‌లో ఇన్‌చార్జిగా ఉన్న సి.జె.శ్రీనివాస్ వివక్షతో తక్కువ సంఖ్యను చూపించి, అవమానించారంటూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
ఇక మిగతా జిల్లాల్లోనూ సభ్యత్వం ఆశించినంతగా లేదని కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుల పనితీరు సరిగా లేదని, సభ్యత్వ నమోదుపై నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకోసం పనిచేయకుండా పదవులు మాత్రమే కావాలంటే సరికాదని, అలసత్వం చూపిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30నాటికి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తిచేయాలని, జాబితాలను సీడీల రూపంలో తయారుచేసి పార్టీ కార్యాలయానికి అందించాలని కుంతియా ఆదేశించారు.