
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శాసనసభలో ప్రతి ఎమ్మెల్యేకు తప్ప కుండా మాట్లాడే అవకాశం ఉంటుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాసనసభ నిబంధనలను అతిక్రమించి గాడితప్పి మాట్లాడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘అసెంబ్లీ సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌తోపాటు అన్ని పక్షాల నేతలకు ధన్యవాదాలు.
రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎటువంటి అహంకారం లేదు. మరింత బాధ్యత పెరిగింది. సభలో రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేందుకు అన్ని రంగాలపై క్లుప్తంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. భవిష్యత్‌లో సభ్యులందరు నాతో సహకరిస్తారని, హుందాగా వ్యవహరిస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ రోజుతో రెండో శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు అభినందనలు. ఇవాళ సభలో నాకు వచ్చిన పదవి వారసత్వంగా వచ్చింది కాదు. తెలంగాణ శాసనసభ గౌరవాన్ని పెంచుతా’ అని స్పీకర్ పోచారం అన్నారు.