హామీలను గాలికొదిలేశారు..?
వినాయక్‌నగర్ : మోడీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల తరువాత నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి, ప్రతి పౌరుని జేబులో రూ.15లక్షలు పెడతానని చెప్పిన మాటలు గాలికి వదిలేసి, గాలిమోటార్లలో ఇతర దేశాలను చుట్టేస్తున్నాడని ఆల్ ఇండియా ట్రెడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్ విమర్శించారు. రెండు రోజుల మహాసభల్లో భాగంగా మెదటి రోజు శనివారం జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున శ్రద్ధానంద్ గంజ్ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్ పా ల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మృత్యువాత పడుతున్నారని అన్నారు. కానీ ఆ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు పలు రాయితీలిచ్చి అభివృద్ధి రాష్ట్రంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతీ ఎర్రజెండా కార్మిక సంఘం కాదని, ఏఐటీయూసీ 94 ఏళ్ల క్రితం పుట్టిందన్నారు.
కార్మిక లోకానికి ఎనలేనిసేవలందించిన ఘనత ఏఐటీయూసీదే అని పేర్కొన్నారు. మిగతా ఎర్రజెండాల కార్మిక సంఘాలు డూప్లికేటువని ఆయన విమర్శించారు. మోడీ, కేసీఆర్‌లు అన్నదమ్ముళ్లుగా తయారయ్యారని ఆయన విమర్శించారు. వారికి ఏఐటీయూసీ తరపున నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని, వీటితో వారు బతుకగలరా అని ప్రశ్నించారు.
మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ, ప్రతి కార్మికుడికి రూ.15వేలు కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇతర దేశల్లా మార్చడం కాదని, తమను తమలాగా బతకడానికి ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కలు తిరుగుతున్నాయని, కానీ రోగులు మాత్రం వెళ్లడంలేదన్నారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ నాయకులు వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా, నాయకులు వై. ఓమయ్య. సుధాకర్, అన్ని అనుబంధ విభాగాల కార్మిక సంఘాల నాయకులు, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య తదితరులు పాల్గొన్నారు.