హాస్టళ్లకు నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోయింది.. దురాశకు
పోయి కాంట్రాక్టర్లు ఎమ్మార్పీ కంటే తక్కువకు కోట్‌చేసి టెండర్
దక్కించుకున్నారు.. ఆ తర్వాత ధరలు మండిపోతున్నాయంటూ
మెలిక పెట్టి సరుకుల సరఫరా నిలిపివేశారు.
నల్లగొండ : సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కిరాణం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు లోబడి నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలనే అధికారుల నిర్ణయాన్ని టెండరుదారులు బేఖాతరు చేశారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 122 హాస్టళ్లకు కిరాణం సరుకులు సరఫరా చేసే నిమిత్తం గతేడాది మేలో టెండర్లు పిలిచారు. సాధారణ ఎన్నికల అనంతరం జూలైలో ఆరు ఏజెన్సీలను ఎంపిక చేసి కిరాణ సరుకుల సరఫరా కాంట్రాక్టు అప్పగించారు.
మొదటి రెండు నెలలు సరఫరా చేసిన ఏజెన్సీలు ఆ తర్వాత లేనిపోని కారణాలను సాకుగా చూపి సరుకులు సరఫరా చేయకుండా మొండికేశాయి. దీంతో అప్పటినుంచి ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగిసే వరకు ఆ భారాన్ని వార్డెన్‌లే మోయాల్సి వచ్చింది. సరుకుల కొనుగోలులో అక్రమాలు నియంత్రించి, నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలన్న ఉద్దేశంతోనే సాంఘిక సంక్షేమ శాఖ ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ఆరంభానికి నెల రోజుల ముందుగానే టెండర్లు పిలిచి ఏజెన్సీలు ఎంపిక చేస్తోంది. అదే పద్ధతి అవలంబించిన అధికారులకు గతే డాది చేదు అనుభవం ఎదురైంది.
దురాశకు పోయి...
టెండర్‌దారులు దురాశకు పోయి అతితక్కువ ధరలకు సరుకులు సరఫరా చేస్తామని కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఉదాహరణకు విజయా పామాయిల్ లీటరు రూ.63, కందిపప్పు కి లో రూ.60, చక్కెర కిలో రూ.31, టైగర్/సన్‌ఫీస్ట్ బిస్కట్ ప్యాకెట్ ఎమ్మార్పీ మీద 5 పైసలు తక్కువ...ఇలా 29 రకాల సరుకులు మార్కెట్ ధరల కంటే చౌక ధరలకు సరఫరా చేస్తామని పోటీ పడి మరీ టెండర్లు వేసి కాంట్రాక్టు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఏజెన్సీలు రెండు మాసాలకోసారి ఇండెంట్ ప్రకారం సరుకులు సరఫరా చేయాలి. ఈ సరుకులు హాస్టళ్ల పాయింట్ వద్దకు కాకుండా సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయానికి (ఏఎస్‌డబ్ల్యూఓ) సరఫరా చేయాలి.
శాంపిల్స్ ప్రకారం నాణ్యమైన వస్తువులు మాత్రమే ఇవ్వాలి. ఏఎస్‌డబ్ల్యూఓ వద్దకు వచ్చిన సరుకులు స్టాకు రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాత హాస్టళ్లకు పంపిణీ చేయాలి. సరుకుల బిల్లుల ధ్రువీకరించడంలో కూడా ఏపీజీఎస్‌టీ/ టిన్ నంబరు ఉన్న వాటికి మాత్రమే నగదు చెల్లింపులు చేస్తామనే నిబంధన విధించారు. దీంతో మొదటి రెండు మాసాలకు అవసరమయ్యే సరుకులను ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయాలకే సరఫరా చేశారు. అయితే హాస్టల్స్ అవసరాలకు అనుగుణంగా కాకుండా సరుకులన్నీ గంపగుత్తగా తీసుకొచ్చి పడేశారు. ఒప్పందం ప్రకారం కాకుండా అలా ఇష్టం వచ్చినట్లు సప్లయ్ చేస్తే అంగీకరించేది లేదని సహాయ అధికారులు తేల్చి చెప్పారు.
దీంతో కంగుతున్న ఏజెన్సీలు ఇలాగైతే తమ పొట్టనింపుకోవడం కష్టమని భావించి సరుకులను ఏఎస్ డబ్ల్యూఓ కార్యాలయాలకు కాకుండా హాస్టళ్లకు నేరుగా పంపిస్తామని మెలిక పెట్టారు. నేరుగా సరఫరా చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలను ముందుగానే ఊహించే జిల్లా అధికారులు నిబంధనలు కఠినం చేశారు. దీంతో ఏజెన్సీలు ఓ అడుగు ముందుకు వేసి మార్కెట్లో ధరలు పెరిగాయని, వాటికి అనుగుణంగా టెండరు ధరలు సవరిస్తే అందజేస్తామని మరో మెలిక పెట్టారు. దీనికి జిల్లా అధికారులు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఏజెన్సీలు సరఫరా నిలిపేశాయి. దీంతో మరో గత్యంతరం లేక వార్డెన్లు సరుకులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ ఏజెన్సీలపై ఎలాంటి చర్యలూ తీసుకోని జిల్లా యంత్రాంగం మళ్లీ వచ్చే విద్యాసంవత్సరానికి కిరాణం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది.
కిరాణం..బంద్!
Published Mon, May 11 2015 12:35 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement