ఆగిన బాల్య వివాహం
దుబ్బాక : బాల్య వివాహాలు వద్దని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారాలను నిర్వహిస్తున్నా ప్రజలకు కనువిప్పు కలగడం లేదు. జిల్లాలో ఎక్కడో ఓ చోట బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అభం, శుభం తెలియని చిన్నారుల పెళ్లి చేయాలనుకున్న పెద్దల నిర్ణయాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన దుబ్బాక మండలం కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రానికి చెందిన పర్వతం లక్ష్మి, లింగయ్య కూతురు శ్యామల, నూనె లక్ష్మి, నర్సింలు కుమారుడు సుధాకర్‌ల వివాహం చేయడానికి సర్వం సిద్ధం చేశారు.
మరో పది నిమిషాల్లో జరగాల్సిన పెళ్లిని సమాచారం అందుకున్న తహహల్దార్ అరుణ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు హేమలత, యాక్ పాషా బేగం అక్కడికి అడ్డుకున్నారు. పెళ్లి నిశ్చయించిన పెద్దలకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాంతో జరిగే అనార్థాలను వివరించారు. చిన్నారులను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. వధువు వివాహ వయస్సు 18, వరుని వివాహ వయస్సు 21 సంవత్సరాలు నిండితేనే ఇరువురి సమ్మతి మేరకు వివాహం చేయాలని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.