గాలివాన బీభత్సం
♦ నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో కురిసిన వర్షం
♦ కూలిన చెట్లు, ఒరిగిన స్తంభాలు, దెబ్బతిన్నతోటలు
నాగర్‌కర్నూలు రూరల్/బిజినేపల్లి/వంగూరు : నియోజకవర్గంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. నాగర్‌కర్నూలు మండలం అంతటి, పులిజాల, మల్కాపూర్, మంతటి గ్రామాలతోపాటు పట్టణంలో గంటకుపైగా గాలితో కూడిన వర్షం కురిసింది. గగ్గలపల్లిలో పాత ఇళ్లు, రేకుల ఇళ్లు కూలిపోయాయి. అలాగే రహదారివెంట ఉన్నచెట్లు, స్తంభాలు కూలిపడ్డాయి. అదేవిధంగా బిజినేపల్లి మండలంలో కురిసిన గాలీవాన బీభత్సానికి భారీగా ఆస్తినష్టం జరిగింది. మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
రేకుల షెడ్లు ఎగిరిపోగా, మండల కేంద్రంలోని గోవుల చంద్రయ్యకు చెందిన ఇంటి రేకులు లేచిపోయి ఇంట్లో ఉన్నవారికి గాయాలయ్యాయి. పాలెం పారిశ్రామిక వాడ వద్ద విద్యుత్‌తీగలు తెగిపడడి గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నిరీక్షించారు. పోలేపల్లి, ఖానాపూర్, గుడ్లనర్వ తదితర గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపోయి అంధకారం నెలకొంది. అలాగే వంగూరు మండలంలో కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది.
చిరుజల్లులతో ఊరట
పాలమూరు : పగలంతా ఎండవేడిమి ఉండగా గురువారం సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కొంత ఊరట చెందారు. జిల్లా కేంద్రంతో సాయంత్ర ంవేళ కురిసిన చిరుజల్లులతో ఎండతాపం తగ్గి చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంలోనే కాకుండా జడ్చర్ల, కొత్తకోట, దేవరకద్ర, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల గాలులతో కూడిన చిరుజల్లులు కురిసి వాతావరణం కొంతమేర చల్లబడింది. వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో అలిట్టి చెన్నయ్య అనే రైతుకు చెందిన పాడిఆవును పొలంలో కట్టేసి ఉంచగా పిడుగు పాటుకు మృతి చెందింది. అదేవిధంగా ఆయా గ్రామాల్లో విద్యుత్‌స్తంభాలు కూలిపోయి అంధకారం నెలకొంది.