
దుండగుల కథ ముగిసింది...
నల్లగొండ : సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడిన దుండగుల కథ ముగిసింది. మూడు రోజులుగా దుండగుల కోసం విస్తృతంగా గాలించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌లో వారిని మట్టుబెట్టారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీ పురంలో శనివారం దుండగులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమర్యారు. పోలీసులు-దోపిడీ దొంగల మధ్య ఆరు రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం.
కాగా సూర్యాపేట బస్టాండ్లో కాల్పులకు పాల్పడిన దుండగులు అర్వపల్లి సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అక్కడకు బయల్దేరారు. అయితే పోలీసుల రాకను గమనించిన దుండగులు అక్కడ నుంచి వెళ్లిపోయే క్రమంలో లింగమల్లు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని ద్విచక్రవాహనం లాక్కుని పరారయ్యారు. పోలీసులు వెంబడించడంతో దుండగులు డి.కొత్తపల్లి గుట్టల్లోకి పరారయ్యారు. పోలీసులు డి.కొత్తపల్లి చేరుకోవడంతో అక్కడి నుంచి మోత్కూరు మండలం జానకీపురం వైపు వెళ్ళారు.
అయితే పోలీసులు వారిని సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. దాంతో జానకీపురం ఇసుక డంప్ల వద్ద పోలీసులకు, దుండగుల మధ్య తీవ్రంగా ఎదురు కాల్పులు జరిగాయి. అయితే పోలీసులు వారిని చాకచక్యంగా మట్టుపెట్టారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య గాయపడ్డారు.
చికిత్స నిమిత్తం ఎస్ఐని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సీఐ బాలగంగిరెడ్డి కామినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ప్రభాకరరావు ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఎన్కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.