బంగారు తెలంగాణలోనూ దీక్షలా?
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి విస్మయం
ఫిజియోథెరపిస్టుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్
హైదరాబాద్: మన రాష్ట్రం వచ్చింది.. మనది బంగారు తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అంటూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా ఆనందపడ్డారని, కానీ బంగారు తెలంగాణలోనూ దీక్షలు తప్పడం లేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్టు(టీఏపీ) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్ష కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండలో ఫిజియోథెరపిస్టులు చేస్తున్న దీక్షను చూస్తే బాధేస్తోందని, ఇంతమంది ఆందోళన చేస్తూంటే సీఎం కేసీఆర్‌కు కనపడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. న్యాయమైన ఫిజియోథెరపిస్టుల కోర్కెలు తెలంగాణ ప్రభుత్వంలో కూడా తీరకపోవటం బాధాకరమని, వారి డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, డెంటిస్టులు ఉన్నారని, ఫిజియోథెరపిస్టులు మాత్రం లేరని, తెలంగాణ వ్యాప్తంగా 25 వేల మంది ఫిజియోథెరపిస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే వారి డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే వారికి మద్దతుగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని, అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి వారి డిమాండ్లను పరిష్కరించేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఫిజియోథెరపిస్టులకు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఫిజియోథెరపిస్టుల ప్రైవేట్ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నామన్నారు.
అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఫిజియోథెరపీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫిజియోథెరపిస్టులకు డాక్టరేట్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీ ప్రధానకార్యద ర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ రాజీవ్ విద్యా మిషన్, ఎస్‌ఎస్‌ఏల్లో తాత్కాలికంగా పనిచేస్తున్న ఫిజియోథెరపిస్టులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రెహమాన్, పార్టీ రాష్ట్ర నేతలు ముజ్‌తబ అహ్మద్, గూడూరు జయపాల్‌రెడ్డి, ఎం. భగవంత్ రెడ్డి, కుసుమ కుమార్‌రెడ్డి, మహ్మద్, రాష్ట్ర యువజ విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, సిటీ యువజన విభాగం అధ్యక్షుడు ఎ.అవినాష్ గౌడ్, సేవాదళ్ నగర అధ్యక్షుడు బండారి సుధాకర్, కర్నె ప్రభాకర్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.