
మిర్చి రైతుల పడిగాపులు
► మార్కెట్‌కు వచ్చి మూడు రోజులైనా ఖరీదు చేయని వ్యాపారులు
► 10 వేల బస్తాలకు 3,534 బస్తాలు మాత్రమే కొనుగోలు
► కొనేది ముగ్గురు వ్యాపారులే
సాక్షి, మహబూబాబాద్ :
మిర్చి పంట ఈ సారి రైతన్నను చిన్నబుచ్చింది. విత్తనాల కొనుగోలు దగ్గరి నుంచి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌లో విక్రయించడానికి పడిగాపులు పడుతున్నాడు. తమ సరుకును కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్‌లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మహబూబాబాద్ మార్కెట్‌లో గత కొద్దిరోజులుగా మిర్చి కొనుగోళ్లు సకాలంలో జరగక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం సుమారు 10 వేల బస్తాల మిర్చిఅమ్మకానికి రాగా 3,534 బస్తాలు(1,413 క్వింటాళ్లు) మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి ఈ మారెŠక్‌ట్‌లో బస్తాలకొద్ది మిర్చి మార్కెట్‌లోనే ఉండిపోవడం సాక్షి దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా రైతులను పలకరించగా వారు కన్నీటి పర్యంతమయ్యారు.
ధర లభించక అప్పులపాలు
నకిలీ విత్తనాలతో సరిగా దిగుబడి రాక అవస్థలు పడుతున్న రైతులను మార్కెట్‌లో మిర్చి ధర కలవరపరుస్తోంది. మిర్చికి క్వింటాల్‌కు రూ.8,425 నుం చి రూ.7,825 వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.
కొనేది ముగ్గురు వ్యాపారులే..
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చిని కొనుగోలు చేసేందుకు 10 మంది వ్యాపారులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ముగ్గురు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీరు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే కొనుగోలు చేస్తున్నారు. మిగతా మిర్చి తర్వాత కొనుగోలు చేస్తాం, తమ దగ్గర డబ్బులు లేవని చేతులేత్తుస్తున్నారు.
దీంతో మార్కెట్‌కు వచ్చిన ఒక్కో రైతు సుమారు మూడు రోజులపాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్క రోజులో వెళ్లిపోదామని చేతిలో పెద్దగా డబ్బులు లేకుండా వచ్చిన రైతులు ఆకలికి అలమటిస్తున్నారు. ఇప్పటికైనా పాలకవర్గం, మార్కెట్ కార్యదర్శి పట్టించుకొని మార్కెట్‌కు వచ్చిన సరుకులు ఏ రోజుకారోజు కొనుగోలు చేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
విత్తనం నకిలీది కావడంతో తక్కువ దిగుబడి
నకిలీ విత్తనం కావడంతో తక్కువ దిగుబడి వచ్చింది. నాకు రెండు ఎకరాలు ఉంటే 1.5 ఎకరాలు మిర్చి వేశాను. 14 బస్తాలు దిగుబడి వచ్చింది. చెట్టు ఎత్తు పెరిగిందే తప్ప కాయలు కాయలేదు. తిండి కూడా తినకుండానే బస్తాలు ఎవరైనా ఎత్తుకపోతారనే ఇక్కడే కావలి ఉంటున్నా.- చాప్లా, బలపాల
మూడు రోజులవుతుంది
మార్కెట్‌కు మిర్చి బస్తాలు తీసుకొచ్చి మూడు రోజులవుతుంది. కాంటాలు ఎప్పుడు అవుతాయో అని ఎదురు చూస్తున్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని వ్యాపారులు మార్కెట్‌కు వచ్చి మిర్చి కొనుగోలు చేసేలా చూడాలి.– గుగులోత్ పూల్‌సింగ్, అప్పరాజుపల్లి, గూడూరు