ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాల, ఆత్మహత్యకు పాల్పడిన నవీన్
సాక్షి, బూర్గంపాడు: చిన్నపాటి తగవు విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితుల మధ్య చోటుచేసుకున్న గొడవకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఇంటికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న వీసం నవీన్ (15) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన వీసం కుమార్, జ్యోతి దంపతుల పెద్దకొడుకు నవీన్ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. నవీన్ తండ్రి కుమార్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి జ్యోతి నవీన్‌ను ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించింది. నవీన్ సోమవారం సాయంత్రం హాస్టల్‌లో సెల్‌ఫోన్ విషయంలో మరో విద్యార్థితో గొడవ పడ్డాడు.
సెల్‌ఫోన్ తీశావని నిలదీయటంతో..
తన సెల్‌ఫోన్ తీశావంటూ ఓ విద్యార్థి నవీన్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సోమవారం ఉదయాన్నే ఉప్పుసాకలోని తమ సమీప బంధువు నాగేశ్వరావు ఇంటికి వెళ్లాడు. ఆయన వెంటనే అతన్ని హాస్టల్‌లో వదిలేసి వార్డెన్‌కు చెప్పి వెళ్లాడు. పాఠశాలలో ప్రార్థన ముగిసిన వెంటనే నవీన్ ఎవరికీ చెప్పకుండా బంగారుచెలక లక్ష్మీపురంలోని ఇంటికి వెళ్లి పత్తి చేనుకు పిచికారీ చేసేందుకు దాచి ఉంచిన పురుగుమందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలిస్తుండగా మృతిచెందాడు. సెల్‌ఫోన్ విషయంలో జరిగిన గొడవ కారణంగానే మనస్తాపానికి గురై నవీన్ మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
సోమవారం ఉదయం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నవీన్ సెల్‌ఫోన్‌ను తన స్నేహితుడికి ఇచ్చి తనతో గొడవ పడిన విద్యార్థికి ఇవ్వమని చెప్పినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. రెండేళ్ల క్రితం హాస్టల్ విద్యార్థి పరారై నెలరోజుల తరువాత విజయవాడలో దొరికాడు. గత ఏడాది ఓ విద్యార్థి మరో విద్యార్థిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు పురుగుమందు తాగి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. భద్రాచలం ఐటీడీఏ అధికారులు ఆరా తీసి విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment