Burgampadu
-
మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత
బూర్గంపాడు: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం(65) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత 50 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో మృతి చెందారు. బూర్గంపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 1989, 1994 ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీచేసి విజయం సాధించారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా బూర్గంపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆదివాసీ సమస్యలపై కుంజా భిక్షం నిరంతర పోరాటాలను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో రెండేళ్లు పార్టీలో పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే -
ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్ గొడవ..!
సాక్షి, బూర్గంపాడు: చిన్నపాటి తగవు విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితుల మధ్య చోటుచేసుకున్న గొడవకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఇంటికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న వీసం నవీన్ (15) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన వీసం కుమార్, జ్యోతి దంపతుల పెద్దకొడుకు నవీన్ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. నవీన్ తండ్రి కుమార్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి జ్యోతి నవీన్‌ను ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించింది. నవీన్ సోమవారం సాయంత్రం హాస్టల్లో సెల్‌ఫోన్ విషయంలో మరో విద్యార్థితో గొడవ పడ్డాడు. సెల్‌ఫోన్ తీశావని నిలదీయటంతో.. తన సెల్‌ఫోన్ తీశావంటూ ఓ విద్యార్థి నవీన్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సోమవారం ఉదయాన్నే ఉప్పుసాకలోని తమ సమీప బంధువు నాగేశ్వరావు ఇంటికి వెళ్లాడు. ఆయన వెంటనే అతన్ని హాస్టల్లో వదిలేసి వార్డెన్‌కు చెప్పి వెళ్లాడు. పాఠశాలలో ప్రార్థన ముగిసిన వెంటనే నవీన్ ఎవరికీ చెప్పకుండా బంగారుచెలక లక్ష్మీపురంలోని ఇంటికి వెళ్లి పత్తి చేనుకు పిచికారీ చేసేందుకు దాచి ఉంచిన పురుగుమందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలిస్తుండగా మృతిచెందాడు. సెల్‌ఫోన్ విషయంలో జరిగిన గొడవ కారణంగానే మనస్తాపానికి గురై నవీన్ మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నవీన్ సెల్‌ఫోన్‌ను తన స్నేహితుడికి ఇచ్చి తనతో గొడవ పడిన విద్యార్థికి ఇవ్వమని చెప్పినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. రెండేళ్ల క్రితం హాస్టల్ విద్యార్థి పరారై నెలరోజుల తరువాత విజయవాడలో దొరికాడు. గత ఏడాది ఓ విద్యార్థి మరో విద్యార్థిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు పురుగుమందు తాగి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. భద్రాచలం ఐటీడీఏ అధికారులు ఆరా తీసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
ఇంకా దొరకని మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం ఆచూకీ
తిరుమల: ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల వచ్చిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం తప్పిపోయారు. శనివారం సాయంత్రం కుటుంబంతో కలిసి మూలవిరాట్టును దర్శించుకున్న ఆయన.. ఆలయం నుంచి వెలుపలికి వస్తూ తప్పిపోయారు. దీంతో భిక్షం కుటుంబీకులు తిరుమల పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బుర్గంపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన భిక్షం కొంతకాలంగా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యను ప్రారంభించారు. అయితే 24 గంటలు గడుస్తున్నా మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు కుంజా భిక్షం క్షేమంగా తిరిగి రావాలని ఆయన కుటుంబసభ్యులు ప్రార్థిస్తున్నారు. -
గోదావరి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
బూర్గంపాడు (ఖమ్మం) : వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో.. బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి గోదావరిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండల కేంద్రంలో గౌతమీపురం కాలనీకి చెందిన గుమ్మలాపురం ప్రసాద్(34) బైక్ పై భద్రాచలం వెళ్తున్న సమయంలో.. గోదావరి బ్రిడ్జిపైకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ బైక్ పై నుంచి ఎగిరిపడి గోదావరిలో పడ్డాడు. ఈ క్రమంలో బ్రిడ్జి కింద ఉన్న విద్యుత్ తీగలపై పడి అవి తెగి ఇసుకలో కూరుకుపోయి.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం చూడలేదని, కారు అతి వేగంగా ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
బూర్గంపాడు (ఖమ్మం జిల్లా) : బూర్గంపాడు మండల సమీపంలో గురువారం గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడకికక్కడే మృతిచెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వెంకన్నబాబుగా గుర్తించారు. వెంకన్న కోకోకోలా కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై ఎస్ఐ దాడి!
ఖమ్మం: బూర్గంపాడులో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై ఎస్ఐ రవీంద్ర దాడి చేశాడు. కార్యకర్తలు వెంకటేశ్వర రెడ్డి, పిచ్చిరెడ్డిలను అకారణంగా చితకబాదాడు. ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ఈ దాడిని ఖండించారు. ఎస్ఐ రవీంద్రను తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ** -
పరిశ్రమలకు కేంద్రంగా జిల్లా..
బూర్గంపాడు: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో పవర్ప్లాంట్లు, కాగితపు పరిశ్రమ, ఉక్కు పరిశ్రమలతో పాటు వీటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ, భూ లభ్యతపై జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నీరు, బొగ్గు తదితర ప్రకృతి వనరులు అందుబాటులో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా కీలకంగా మారింది. ఇప్పటికే పాల్వంచలోని కేటీపీఎస్ విస్తరణకు ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తయింది. మణుగూరు పరిసర ప్రాంతాల్లో మరో పవర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు భూముల పరిశీలన జరుగుతోంది. మణుగూరుకు సమీపంలోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాల సమీపంలోని 2 వేల ఎకరాల భూముల లభ్యతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో రైతుల సాగుభూములు, ప్రభుత్వభూములు, అటవీభూముల వివరాలను సేకరిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వ్యవసాయభూములను ఇచ్చేందుకు రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో జిల్లా అధికారులు పవర్‌ప్లాంట్ నిర్మాణాల కోసం అశ్వా పురం మండలంలోని కేశవాపురం, చింతిర్యాలలో కూడా భూముల అన్వేషణ ప్రారంభించారు. ఇటీవల కలెక్టర్ ఇలంబరితి అశ్వా పురం మండలంలో కూడా భూములను పరిశీలించారు. ప్రత్యామ్నాయంగా బూర్గంపాడు మండలంలోని ఇరవెండి, మోతె గ్రామాల సమీపంలోని భూముల వివరాలను కూడా జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది. పినపాక నియోజకవర్గంలో సాగుభూములు ఎక్కువగా ఉండటంతో గోదావరి నదికి అవతలి ఒడ్డున ఉన్న భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూడా భూముల లభ్యతపై అధికారులు ఆరా తీస్తున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక నుంచి మణుగూరు క్రాస్‌రోడ్ వరకు సుమారు 1300 ఎకరాల అటవీభూముల్లో ఐటీసీ మరో మెగా పేపర్పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే వన్యప్రాణి సంరక్షణ, అటవీశాఖల నుంచి పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు సానుకూల సంకేతలు లభించాయి. ఇటీవల ఐటీసీ యాజమాన్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుని కలసి పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం ప్రాంతంలో ఓ కెమికల్ ఇండస్ట్రీని ఏర్పాటుచేసేందుకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా స్థానికంగా చర్చసాగుతోంది. పేపర్, పవర్‌ప్లాంటు ఏర్పాటుతో పాటు వీటికి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా కొందరు పారిశ్రామికవేత్తలు భూముల అన్వేషణలో ఉన్నారు. భూసేకరణే అసలు సమస్య: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా భూసేకరణే అసలు సమస్యగా మారనుంది. పరిశ్రమల ఏర్పాటుకు సాగు భూములను ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరు. తమ జీవనాధారమైన పంట భూములను పరిశ్రమ ఏర్పాటుకు ఇస్తే తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వభూములు అన్యాక్రాంతైమైనాయి.అదేవిధంగా వేలాది ఎకరాల అటవీభూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని ప్రభుత్వం గుర్తించి తిరిగి ప్రభుత్వపరం చేసుకుంటే పరిశ్రమల ఏర్పాటు సులభమయ్యే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో చేసిన భూసేకరణ చట్ట నిబంధనలు కఠినతరంగా ఉండటంతో భూసేకరణ అంతతేలికగా జరిగే పరిస్థితులు లేవు. -
సర్పంచ్‌ను చితకబాదిన ఎస్ఐ
బూర్గంపాడు,న్యూస్‌లైన్: పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజన సర్పంచ్‌ని చితకబాదడంతో గ్రామస్తులు అడ్డుకోగా లాఠీచార్జ్ చేసి, గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో ఓటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలు... మోరంపల్లిబంజర జిల్లాపరిషత్ పాఠశాలలో ఆదివారం పోలింగ్ జరుగుతుండగా అక్కడ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ బొర్రా శ్రీనివాస్‌ను పోలింగ్ కేంద్రం విడిచివెళ్లాలని విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ సురేష్ విచక్షణరహితంగా కొట్టాడు. తాను సర్పంచ్‌నని చెప్పినా వినకుండా కొట్టగా.. రక్తం కారుతుండటంతో గ్రామస్తులు ఎస్ఐని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎస్ఐ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తలుపులు వేసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు. గుమిగూడిన గ్రామస్తులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. గ్రామస్తులను చెదరగొట్టిన పోలీసులు సర్పంచ్‌ను, అతనితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు త రలించారు. సర్పంచ్‌ను ఎస్ఐ కొట్టడం, తరువాత లాఠీఛార్జీ, పోలీసుల కాల్పుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఏవీ. రంగనాథ్ మోరంపల్లిబంజర పోలింగ్‌కేంద్రాన్ని పరిశీలించారు. పరిస్థితిని చక్కదిద్ది పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఆదేశాలు జారీచేశారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, పరిస్థితి అంతా చక్కబడిన తరుణంలో స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు మోరంపల్లిబంజర గ్రామంలో మళ్లీ గ్రామంలోకి వెళ్లి ఇద్దరు, ముగ్గురు ఎక్కడ కనబడినా వారిపై లాఠీఛార్జి చేయడంతో గ్రామస్తులు మళ్లీ ఆందోళనకు దిగగా.. పోలీసులు శాంతింపజేశారు. -
మిన్నంటిన నిరసనలు
బూర్గంపాడు, న్యూస్‌లైన్: బూర్గంపాడును సీమాంధ్రలో కలపటాన్ని నిరసిస్తూ గురువారం స్థానికంగా నిరసనలు మిన్నం టాయి. వందలాది మంది రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. బూర్గంపాడు ప్రధాన కూడలిలో రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేసి, కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు, యువకులు మానవహారం నిర్వహించా రు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో పోలీసులకు, స్థానిక నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వందలాది మంది తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా తెలంగాణలో మమేకమైన బూర్గంపాడును సీమాం ధ్రలో కలపటం నీతిమాలిన చర్యేనని విమర్శిం చారు. ఓ ప్రాంతప్రయోజనాల కోసం తెలంగాణలో అంతర్భాగమైన బూర్గంపాడు మండలాన్ని బలిచేయటం తగదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మండల ప్రజలను ముంచ టం తగదన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఎలా అయితే ఉద్యమించారో.. జిల్లాలోని అన్ని ప్రాంతాలు తెలంగాణలో ఉండేలా కూడా పోరాడాలని తెలంగాణవాదులను కోరారు. ఈ విషయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై పోరాడాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు అఖిల పక్ష నాయకులు పుట్టి కుమారి, జక్కం బలరామ్, భూపెల్లి నర్సింహారావు, పొదిలి రాములు, మారం శ్రీనివాసరెడ్డి, కాకర్ల ప్రతాప్, దుగ్గిరాల శ్రీరామ్‌రెడ్డి, దుద్దుకూరి రాజా, భజన సతీష్, మేకల నర్సింహా రావు, భజన ప్రసాద్, చిప్పా సుధాకర్ పేరాల శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించారు. బంద్ సంపూర్ణం... బూర్గంపాడును సీమాంధ్రలో కలిపే సవరణకు లోక్‌సభ ఆమోదాన్ని నిరసిస్తు అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన బూర్గంపాడు బంద్ సంపూర్ణంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆటో యూనియన్ వారు స్థానికంగా ఆటోలను కూడా నడపలేదు.