బూర్గంపాడు,న్యూస్‌లైన్: పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజన సర్పంచ్‌ని చితకబాదడంతో గ్రామస్తులు అడ్డుకోగా లాఠీచార్జ్ చేసి, గాలిలోకి కాల్పులు జరిపారు.
దీంతో ఓటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలు... మోరంపల్లిబంజర జిల్లాపరిషత్ పాఠశాలలో ఆదివారం పోలింగ్ జరుగుతుండగా అక్కడ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ బొర్రా శ్రీనివాస్‌ను పోలింగ్ కేంద్రం విడిచివెళ్లాలని విధినిర్వహణలో ఉన్న ఎస్‌ఐ సురేష్ విచక్షణరహితంగా కొట్టాడు. తాను సర్పంచ్‌నని చెప్పినా వినకుండా కొట్టగా.. రక్తం కారుతుండటంతో గ్రామస్తులు ఎస్‌ఐని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎస్‌ఐ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తలుపులు వేసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు. గుమిగూడిన గ్రామస్తులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. గ్రామస్తులను చెదరగొట్టిన పోలీసులు సర్పంచ్‌ను, అతనితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు త రలించారు.
సర్పంచ్‌ను ఎస్‌ఐ కొట్టడం, తరువాత లాఠీఛార్జీ, పోలీసుల కాల్పుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఏవీ. రంగనాథ్ మోరంపల్లిబంజర పోలింగ్‌కేంద్రాన్ని పరిశీలించారు. పరిస్థితిని చక్కదిద్ది పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఆదేశాలు జారీచేశారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, పరిస్థితి అంతా చక్కబడిన తరుణంలో స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసరావు మోరంపల్లిబంజర గ్రామంలో మళ్లీ గ్రామంలోకి వెళ్లి ఇద్దరు, ముగ్గురు ఎక్కడ కనబడినా వారిపై లాఠీఛార్జి చేయడంతో గ్రామస్తులు మళ్లీ ఆందోళనకు దిగగా.. పోలీసులు శాంతింపజేశారు.
సర్పంచ్‌ను చితకబాదిన ఎస్‌ఐ
Published Mon, Apr 7 2014 12:32 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement