‘బకాయి’ బారెడు.. ఇచ్చేది మూరెడు! | students are concern on fees reimbursement | Sakshi
Sakshi News home page

‘బకాయి’ బారెడు.. ఇచ్చేది మూరెడు!

Published Sun, Oct 19 2014 12:19 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

‘బకాయి’ బారెడు.. ఇచ్చేది మూరెడు! - Sakshi

‘బకాయి’ బారెడు.. ఇచ్చేది మూరెడు!

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్  నిధులపై సర్కారు స్పష్టతనిచ్చింది. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. శనివారం రూ.500 కోట్లు విడుదల చేసింది. 2011-12 విద్యా సంవత్సరం నుంచి ఫీజు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కళాశాల యాజమాన్యాలు అటు ప్రభుత్వంపై, ఇటు విద్యార్థులపై ఫీజు కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం వార్షిక పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయం కావడంతో కొర్రీలు పెట్టాయి. బకాయిలిస్తేనే పరీక్ష ఫీజు తీసుకుంటామని మెలిక పెట్టడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో తాజాగా ఫీజు బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం విద్యార్థులకు ఊరటనిచ్చింది.

బకాయిలు రూ.442.8 కోట్లు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే అత్యధిక వృత్తి విద్యా కాలేజీలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్య, సాంకేతిక విద్య, పీజీ తదితర కేటగిరీలకు సంబంధించి 1,054 కాలేజీలున్నాయి. ఇందులో వసతులు, అనుమతులు, ఇతర కారణాలవల్ల కొన్ని కాలేజీలు మూతపడడంతో ప్రస్తుతం 935 కాలేజీల్లో దాదాపు 3లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ప్రస్తుత మొదటి సంవత్సరం విద్యార్థులను మినహాయిస్తే.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 1,45,992 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

వీరికిగాను 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫీజు రాయితీ కింద రూ.375.13 కోట్లు చెల్లించాలి. అదేవిధంగా ఉపకారవేతనాల రూపంలో రూ.67.67 కోట్లు ఇవ్వాలి. కేవలం జిల్లాలోనే రూ.442.8కోట్లు బకాయిలున్నాయి. ఈ క్రమంలో సర్కారు కేవలం రూ.500 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాకు అరకొర నిధులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

‘ఫీజు’ కట్టండి..
2014-15 విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైంది. ఈక్రమంలో విద్యార్థులు వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు కళాశాలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీలకు సంబంధించి మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు తప్పించి.. మిగతా విద్యార్థుల పరీక్షల ఫీజుకు సంబంధించి ఇటీవల ఆయా యూనివర్సిటీలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఈ క్రమంలో ఫీజు చెల్లించేందుకు కళాశాలలోని పరిపాలనాధికారుల వద్దకు వెళ్లిన విద్యార్థులు తెల్లముఖం వేయాల్సి వస్తోంది.

2013-14 సంవత్సరానికి సంబంధించి ఫీజు చెల్లిస్తేనే తాజాగా పరీక్ష ఫీజు తీసుకుంటామని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం మంగ్‌ల్‌పల్లిలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాల ఇదే తరహాలో విద్యార్థులకు తేల్చి చెప్పింది. దీంతో ఆ విద్యార్థులంతా పరీక్ష ఫీజు చెల్లించకుండా ఇంటిముఖం పట్టారు. గడువులోగా ఫీజు చెల్లించకుంటే విద్యాసంవత్సరం వృథా అయ్యే అవకాశం ఉంది. ఘట్‌కేసర్, కీసర, మొయినాబాద్‌లోని పలు కాలేజీ యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు కోసం విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఈ క్రమంలో సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించడంతో వారు ప్రత్యేకంగా లేఖలు రాస్తూ యాజమాన్యాలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల పరీక్ష ఫీజు తీసుకుంటుండగా.. మరికొన్నిచోట్ల మాత్రం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
ఆందోళన వద్దు.. లేఖలు ఇస్తున్నాం..
ఫీజుల కోసం పలు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మా కార్యాలయంలో సంప్రదించిన విద్యార్థులకు శాఖ తరఫున ప్రత్యేకంగా కాలేజీ యాజమాన్యాలకు లేఖలు ఇస్తున్నాం. ‘నిధులు విడుదల ప్రకారం బకాయిలు చెల్లిస్తాం’ అని ఆ లేఖలో ఇస్తున్నాం. అదేవిధంగా జిల్లాలోని అన్ని కాలేజీల యాజమాన్యాలకు ప్రత్యేకంగా లేఖలు పంపించే ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష ఫీజు తీసుకోకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.

 - వి.వి.రమణారెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement