తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 స్థానికత చేయడం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 స్థానికత చేయడం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన గురువారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని తెలంగాణలో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల భారాన్ని రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సూచించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేసుకోవాలని మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై గవర్నర్ నరసింహన్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాగా తెలంగాణ విద్యార్థులకు బోధనా రుసుము చెల్లించడానికి ప్రభుత్వం 'ఫాస్ట్' పథకంకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.