శంషాబాద్ రూరల్ : చాలీచాలని భోజనం పెట్టడమే కాదు.. నిత్యం వేధింపులు. కాస్మొటిక్స్, యూనిఫాంలు అడిగితే.. మీ ముఖాలకు అవి అవసరమా అంటూ హేళన. అంతేకాదు.. హాస్టల్‌కు వచ్చిన సరుకులను పక్కదోవ పట్టించి సొమ్ము చేసుకోవడం.. ఇన్నాళ్లూ వీటన్నింటినీ మౌనంగా భరించిన పాల్మాకుల క స్తూర్బాగాంధీ గిరిజన బాలికల విద్యాలయం విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మాకు న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఆందోళనలో విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి, అకౌంటెంట్ వీరమణిలు కుమ్మక్కై సరుకులను బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ఎక్కువ చూపి మిగిలిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. స్థానికంగా ఉన్న ఓ రేషన్ డీలరుకు ఈ సరుకులను ఎవరికీ తెలియకుండా రాత్రి వేళ విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ నెల 12న రాత్రి ఉపాధ్యాయులను అందరినీ ఇంటికి పంపించిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ దేవి విద్యార్థులను కూడా టీవీ చూడమంటూ గదిలోకి పొమ్మందని, చదువుకుంటామని కొందరు చెప్పినా వినకుండా టీవీ గదిలోకి వెళ్లగొట్టిందని ఆరోపించారు.
అనంతరం హాస్టల్‌లో ఉన్న మూడు క్వింటాళ్ల బియ్యం, 30 లీటర్ల మంచినూనె, 30 కిలోల కందిపప్పు, 25 కిలోల చక్కెర, 63 ఖాళీ గోనె సంచులను ఓ ఆటోలో ఎక్కించిందన్నారు. విషయం పసిగట్టి అక్కడికి చేరుకుని.. సరుకులు ఎక్కడికి పంపిస్తున్నారని ప్రశ్నిస్తే స్పెషల్ ఆఫీసర్ మమ్ములను బెదిరించిందని వెల్లడించారు. అదేరోజు రాత్రి ఆందోళనకు దిగడంతో విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన స్పెషల్ ఆఫీసర్.. సరుకులను మరుసటి రోజు తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ పాఠశాలకు తెప్పించారన్నారు. పాఠశాల నిర్వహణ తీరుపై నిలదీస్తే.. మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిందని విద్యార్థులు వాపోయారు.
నీచంగా మాట్లాడుతోంది..
స్పెషల్ ఆఫీసర్ దేవి మా పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కించపరుస్తూ ఇష్టంవచ్చినట్టు తిడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ గుడ్డు ఇవ్వాల్సి ఉండగా రోజువిడిచిరోజు ఇస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజుల నుంచి కూరగాయలు వండకుండా కేవలం సాంబారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. పాఠశాల ప్రారంభం అయినప్పటినుంచి కేవలం మూడు సార్లు మాత్రమే పండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఎవరైనా తనిఖీకి వస్తే అంతా సవ్యంగా ఉందని చెప్పాలంటూ బెదిరిస్తున్నదని ఆరోపించారు.
తప్పు జరిగింది క్షమించండి
విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న విలేకరులు పాఠశాల వద్దకు చేరుకోవడంతో స్పెషల్ ఆఫీసర్ దేవి ‘తప్పు జరిగింది.. ఈ ఒక్కసారికి క్షమించండి’ అంటూ విద్యార్థులను వేడుకున్నారు. ‘నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.. నన్ను వదిలేయండి’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల నిర్వహణ ఎలాగో తనకు తెలియదని, అకౌంటెంట్ చెబితేనే సరుకులను బయటకి పంపించానని చెప్పారు. ‘దేవి మేడమ్ విద్యార్థుల హాజరును ఎక్కువగా చూపించాలని చెబితేనే తాను అలా చేశాన’ని అకౌంటెంట్ వీరమణి వివరణ ఇచ్చారు. ఇంతలో స్థానిక నాయకులు కొందరు రంగంలోకి దిగి విద్యార్థులకు, అధ్యాపక బృందానికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఈ మేడమ్ మాకొద్దు!
Published Wed, Jul 16 2014 1:46 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement