ప్రగతినగర్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం ఉదయం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా కోర్టు వద్దే ఇనుప కంచెలు వేయడంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. అనంత రం కలెక్టరేట్‌లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కలెక్టరేట్‌లో ముఖ్యమైన అధికారులు ఎవరూ లేరని సముదాయించారు. విద్యార్థులు సమస్యలతో సతమతమవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం ఉదాసీనత చూపడం సరి కాదంటూ పీడీఎస్‌యూ నాయకులు మండిపడ్డారు. కలెక్టరేట్ గేటు వరకైనా అనుమతి ఇవ్వాలని కోరారు. పోలీసులు ఇందుకు అంగీకరించకపోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. విద్యార్థులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు.
అయినా విద్యార్థులు ఆగకపోవడంతో లాఠీ చార్జి చేసి అక్కడి నుంచి చెదరగొట్టా రు. దీంతో పలువురు విద్యార్థులు ఇనుప కంచెలో ఇరుక్కుపోయారు. మిగిలినవారు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెబుతూ విద్యార్థులను దొరికినవారిని దొరికినట్టు అరెస్టు చేశారు. విద్యార్థులు పోలీసు వాహనాలు కదలకుండా అడ్డు తగలడంతో పోలీసులు రెచ్చిపోయి వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ప్రైవేట్ అటోలో తోసి ఠాణాలకు తరలించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.
పొలీసుల చర్య అమానుషం
సమస్యలపై ఉద్యమించిన విద్యార్థులను అరెస్టు చేయడం అమానుషమని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సరిత అన్నారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కోసం తాము పోరాడుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, గవ ర్నర్‌గిరీ కొనసాగుతోందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
అరెస్టయినవారిలో పీడీఎస్‌యూ నాయకులు అన్వేష్, సౌందర్య, సుధాకర్, సుమన్, గౌతంకుమార్, సాయినాథ్, ఆజాద్, రా జు, స్వప్న, రాజేశ్వర్, అరుణ్‌కుమార్, కల్పన, ప్రగతి, స్వరూప, దేవరాజు, గణేష్, కళ్యాణ్, కిరణ్, రాకేష్, క్రాంతి, కార్తిక్, సుజిత్‌కుమార్, నరేష్, స్వప్న తదితరులు ఉన్నారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన సమయం లో జరిగిన తోపులాటలో ఓ విద్యార్థికి సంబందించిన వెండి గొలుసు పడిపోయింది. అరెస్టు అనంతరం కొంత మంది విద్యార్థులు గొలుసు కోసం వెతికారు. దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
చెదరగొట్టి...చితకబాది
Published Wed, Aug 13 2014 3:23 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement