- కేయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ సింగరాచార్య
- ముగిసిన ఇంటర్ విద్యార్థుల ఇన్‌స్పైర్ క్యాంపు
కేయూ క్యాంపస్ : విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాచార్య సూచించారు. కేయూ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆ విభాగం సెమినార్ హాల్‌లో ఇంటర్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఐదు రోజుల ఇన్‌స్పైర్ సైన్స్ క్యాంప్ ఆదివారం సాయంత్రం ముగిసింది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో సింగరాచార్య ముఖ్యఅతిథిగా మాట్లాడారు. భారతదేశంలో అనేక వనరులు ఉండి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే, వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం వల్లే సమస్యల పరిష్కా రం సాధ్యం కావడం లేదన్నారు. ఈ మేరకు విద్యార్థులు శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడమే కాకుండా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు.
ఇంటర్ పూర్తి కాగానే నిర్ణయించుకోవాలి..
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇన్‌స్పైర్ ప్రోగ్రాంలు దోహదం చేస్తాయని నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి అన్నార. క్యాంపులో భాగంగా పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు చెప్పిన అంశాలను సోపానంగా చేసుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కాకుండా అంతకంటే మెరుగైన ఉపాధి కల్పించే ఎన్నో కోర్సులు ఉన్నాయని తెలిపారు.
అయితే, విద్యార్థులు ఇంటర్ పూర్తి కాగానే తమ భవిష్యత్ ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకుని దాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఇన్‌స్పైర్ క్యాంపు కోఆర్డినేటర్ ఎం.కృష్ణారెడ్డి, జువాలజీ విభాగాధిపతి స్వామి మాట్లాడారు. కాగా, చివరి రోజు సెషన్‌లో భాగంగా ఎన్‌జీ రంగా యూనివర్సిటీ శాస్త్రవేత్త ఉమారెడ్డి అగ్రికల్చర్ బీటెక్ ప్రాధాన్యతను వివరించారు.
హైదరబాద్ ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ సీహెచ్.రాజిరెడ్డి మాట్లాడుతూ మానవాళి సంక్షేమం, నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులు, ఆహార పదార్థాల్లో కెమిస్ట్రీ ఉపయోగాలను తెలి పారు. ఆ తర్వాత క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు రక్షిత, అరుణ్,అభినవ్, మహేష్ మాట్లాడుతూ తాము నేర్చుకున్న అంశాలు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.
అయితే, పదో తరగతిలో 9 జీపీఏ వచ్చిన వారికే కాకుండా 8 జీపీఏ వచ్చిన వారికి క్యాంపులో పాల్గొనే అవకాశం కల్పించి పది రోజుల పాటు నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముగింపు సమావేశంలో భాగంగా పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.