నేలకొండపల్లి (ఖమ్మం) : విద్యార్థుల బాగోగులను పట్టించుకోని ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రాస్తారోకో జరిగింది. స్థానిక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ప్రమాదవశాత్తు ఒక విద్యార్థిని కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటన అనంతరం ప్రిన్సిపాల్ వెంకట లక్ష్మి సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తూ సోమవారం ఉదయం మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొందరు పాఠశాల ఎదురుగా రహదారిపై బైఠాయించారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగింది. సీఐ కిరణ్‌కుమార్ అక్కడికి చేరుకుని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు.