విద్యార్థుల ఫీజు పోరు
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంత్రుల ఇళ్ల ముట్టడి
నెట్‌వర్క్: విద్యార్థులు పోరుబాట పట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, ఫాస్ట్ పథకం విధివిధానాలను ప్రకటించాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల ఎదుట ఆందోళన చేపట్టారు. పలుచోట్ల మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. హైదరాబాద్‌లో ఎక్సైజ్ మంత్రి పద్మారావు ఇంటి ఎదుట విద్యార్థులు బైఠాయించారు. అలాగే, నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించేందుకు యత్నించారు.
మహబూబ్‌న గర్ జిల్లా జడ్చర్లలో విద్యుత్ మంత్రి లక్ష్మారెడ్డి ఇంటిని, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంటిని, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిజామాబాద్‌లోని ఎంపీ కవిత ఇంటి ఎదుట, కామారెడ్డిలోని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం మామిడిగూడలో జరిగిన సభలో ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతుండగా విద్యార్థులు నినాదాలు చేశారు. వరంగల్‌లో పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు.