నాట్లు వేస్తున్న ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
ములుగు: భూపాలపల్లి, ములుగు ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శనివారం దినసరి కూలీ అవతారం ఎత్తారు. సెలవు రోజు కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రాపురం వెళ్లారు. కౌలు రైతు రాఘవరెడ్డి–నీలమ్మ దంపతులకు చెందిన పొలంలో ఉదయం నుంచి కూలీలతో కలసి వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్లపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. కూలీలు భోజనంలో తీసుకవచ్చే ఆవకాయ పచ్చడితో తిన్నారు. సాయంత్రానికి మధ్య మధ్యలో బురద జంబు తోలారు. పని ముగించుకున్న అనంతరం రైతు రాఘవరెడ్డి నుంచి రూ.250 కూలిగా తీసుకున్నారు.
కూలీ డబ్బుకు మరింత కలిపి ఆర్థిక సాయం
గ్రామానికి చెందిన చాకలి సారమ్మ వృద్ధాప్యంలోనూ మరుగుజ్జుగా ఉన్న తన ముగ్గురు పిల్లలను కష్టపడి పోషిస్తోంది. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తనకు వచ్చిన కూలీ డబ్బులకు మరికొంత కలిపి ఆ కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, గడిచిన ఐదేళ్లలో ఏడాదిలో ఒకరోజు గ్రామాలకు వెళ్లిన సందర్భంగా రైతులతో కలసి వరి నాటు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తస్లీమా తనలో ఉన్న మరో కోణంతో ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment