చందాలకు వచ్చి.. పోలీసులకు చిక్కి | Subscriptions to come to the police captured | Sakshi
Sakshi News home page

చందాలకు వచ్చి.. పోలీసులకు చిక్కి

Published Sun, Dec 7 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

చందాలకు వచ్చి.. పోలీసులకు చిక్కి

చందాలకు వచ్చి.. పోలీసులకు చిక్కి

ముగ్గురు మాజీ నక్సల్స్ అరెస్ట్
ఎయిర్‌గన్, టాయ్‌పిస్టల్ స్వాధీనం

 
ములుగు : జనశక్తి పేరిట వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేసేందుకు వచ్చిన ముగ్గురు మాజీ నక్సలైట్లు పోలీసులకు చిక్కారు. సులభంగా డబ్బు  సంపాదించాలని పథకం రచించి కటకటాలపాలయ్యూరు. ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్ కథనం ప్రకారం.. వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్‌కు చెందిన బొడగాని సారంగం, ములుగు మండలం రాయినిగూడెంకు చెందిన యాట కుమారస్వామి, కరీంనగర్ జిల్లా మహముత్తారం గ్రామానికి చెందిన పల్లెర్ల తిరుపతి గతంలో నక్సల్స్ దళాల్లో పనిచేసి లొంగిపోయారు. ముగ్గురు భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన మీనవేని ఓదేలుతో కలిసి రెండు నెలల క్రితం కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అత్తని రాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.

జనశక్తి పేరుతో చందాలు వసూలు చేయాలని నిర్ణయించుకుని, ఆయుధాల కోసం ప్రయత్నిం చారు. తన వద్ద ఎయిర్‌గన్ ఉందని యాట కుమారస్వామి చెప్పగా.. సారంగం మరో టాయ్‌పిస్టల్‌ను సమకూర్చాడు. రెండింటిని సారంగం వెంకటాపురం మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన దుంపాల నర్సయ్య ఇంటి వెనుక గోతి తీసి పాతిపెట్టారు. ప్రణాళిక ప్రకారం వాల్‌పోస్టర్లను ప్రింట్ చేయించారు.
 ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందడంతో నర్సయ్య ఇంటి వెనక దాచిపెట్టిన డమ్మీ పిస్టల్, ఎరుుర్‌గన్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకుని విచారణ  చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం వెంకటాపురం పోలీసులు, సివిల్ ఫోర్స్ సిబ్బంది తాళ్లపాడు జంక్షన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు.

వారిని సోదా చేయగా జనశక్తి పార్టీకి చెందిన మూడు  వాల్‌పోస్టర్లు లభించాయి. వారు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. 176/2014,యూ/ఎస్ 25(1),(బీ) ఇండియన్ ఆర్మ్స్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో ములుగు సీఐ శ్రీధర్‌రావు, ఏటూర్‌నాగారం సీఐ కిషోర్‌కుమార్, వెంకటాపురం ఎస్సై ఎండీ హన్నన్, గణపురం ఎస్సై భూక్య రవికుమార్, సిబ్బంది ఉన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement