సబ్సిడీ మహాప్రభో..! | Subsidy effect ..! | Sakshi
Sakshi News home page

సబ్సిడీ మహాప్రభో..!

Published Sat, Jun 14 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

సబ్సిడీ మహాప్రభో..!

సబ్సిడీ మహాప్రభో..!

 సబ్సిడీ సొమ్ము ఆగిపోయింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ అయోమయంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు ముందు బ్యాంకు ఖాతాలు తెరిచి.. ఎప్పుడెప్పుడు సబ్సిడీ సొమ్ము విడుదలవుతుందా... అని ఎదురుచూస్తున్నారు. ఎంచుకున్న యూనిట్లు ప్రారంభించేందుకు సర్కారు తమపై ఎప్పుడు దయ చూపుతుందా.. అని నిరీక్షిస్తున్నారు. జిల్లాలో రూ.50 కోట్లకుపైగా సబ్సిడీ సొమ్ము రావాల్సి ఉంది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర విభజనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు చీలిపోవటంతో నిధులన్నీ ఫ్రీజ్ అయ్యాయి. దీంతో కొత్త కార్పొరేషన్లు విడివిడిగా ఖాతాలు తెరిచిన తర్వాతే... నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాలపై అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యాక్షన్ ప్లాన్ అమలుకు హడావుడి చేసింది. జీవో నంబరు 101 ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్‌తో పాటు వికలాంగులు, మత్స్యకారుల సంక్షేమ విభాగాలు, మెప్మా, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ల్లోని బ్యాంక్ లింకేజీ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. గతంతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలకు ఈసారి సబ్సిడీ మొత్తం పెరగటంతో దరఖాస్తుదారులు సైతం పోటీ పడ్డారు. గతంలో 30 శాతం మాత్రమే ఉన్న సబ్సిడీని బీసీలు, వికలాంగులకు 50 శాతం, ఎస్సీ ఎస్టీలకు 60 శాతానికి పెంచింది.
 
 గతంలో 18-60 ఏళ్ల వయస్సున్న అర్హులకు రుణాలు మంజూరు చేయగా... ఈసారి ఎస్సీ, ఎస్టీలకు 21-45, బీసీ, మైనారిటీ, వికలాంగులకు 21-40 మధ్య వయస్సున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. సామాజిక కార్యకర్తల పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతలతోనే స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపికను రాజకీయ లబ్ధి పొందేందుకు సర్కారు తన గుప్పిట బిగించింది. తీరా.. మార్చి మొదటి వారంలోఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల గ్రౌండింగ్ అర్ధంతరంగా ఆగిపోయింది. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2472 యూనిట్లు మంజూరు చేశారు. బ్యాంకులు సమ్మతించిన మేరకు 1089 మంది లబ్ధిదారుల ఖాతా నంబర్లు కార్యాలయానికి చేరాయి. మార్చి 2 వరకు గ్రౌండ్ అయిన యూనిట్లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు జిల్లాలో 946 మందికి రూ.5.67 కోట్ల సబ్సిడీ విడుదల చేశారు. ఈ సొమ్ము సంబంధిత లబ్ధిదారుల ఖాతాలో జమ అయింది. ఎస్సీ కార్పొరేషన్ విభజనతో సబ్సిడీ సొమ్ము తాత్కాలికంగా నిలిచిపోయింది.
 
 దీంతో దాదాపు 1526 మంది లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. బీసీ కార్పొరేషన్‌లో కేవలం 600 యూనిట్లకు సబ్సిడీ మంజూరైంది. మరో 3000 మందికి సబ్సిడీ విడుదల పెండింగ్‌లో పడింది. జిల్లాలో ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 316 యూనిట్లు లక్ష్యంగా ఎంచుకోగా.. 269 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో 120 ఖాతాలు తెరవటంతో హెడ్ ఆఫీసుకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఒక్కరికీ సబ్సిడీ సొమ్ము జమ కాలేదు. బ్యాంకులతో ముడిపడి ఉన్న లింకేజీ స్కీం కావటం... ఈసారి ఎక్కువ సబ్సిడీ ఉందనే ధీమాతో లబ్ధిదారులు కొత్త యూనిట్లపై గంపెడాశలు పెట్టుకున్నారు. కోడ్ తొలిగినప్పటికీ, కొత్త రాష్ట్రం ఆవిర్భావ సందర్భం కావటంతో కార్పొరేషన్లు, కొత్త ఖాతాలు, నిధుల ఫ్రీజింగ్‌తో ముడిపడి ఉన్న అంశం కావటంతో అధికారులు సైతం సబ్సిడీ సొమ్ము ఎప్పుడొస్తుందో.. స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement