నిజామాబాద్ నాగారం : వారు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ల ఆపరేటర్లు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్మూర్, కామారెడ్డి డివిజన్‌లలో పనిచేస్తున్న ఆపరేటర్లకు కాంట్రాక్టర్లు సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఆర్మూర్, కామారెడ్డిల్లోనే..
జిల్లాలో విద్యుత్‌శాఖలో నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ డివిజన్‌లు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్, బాన్సువాడ డివిజన్‌లలో ఆపరేటర్లకు వేతనాలు అందుతున్నా.. ఆర్మూర్, కామారెడ్డి డివిజన్‌లలో మాత్రం సమస్య ఉంది. ఈ రెండు డివిజన్‌లలో పనిచేస్తున్న సబ్‌స్టేషన్‌ల ఆపరేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు.
ఆర్మూర్ డివిజన్‌లో 64 సబ్‌స్టేషన్‌లున్నాయి.
ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఆపరేటర్లకు నెలకు రూ. 10,771 వేతనం ఇవ్వాలి. కానీ చాలా సబ్‌స్టేషన్లలో కాంట్రాక్టర్లు రూ. 8 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫత్తేపూర్, మగ్గిడి, ఆర్మూర్ టౌన్, ఇస్సాపల్లి, పడకల్, మునిపల్లి తదితర సబ్‌స్టేషన్‌లలో పనిచేస్తున్న ఆపరేటర్లకైతే తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదని తెలిసింది.
కామారెడ్డి డివిజన్‌లో 71 సబ్‌స్టేషన్లున్నాయి. ఇందులో జంగంపల్లి, తిప్పాపూర్, తలమడ్లలలోని ఆ పరేటర్లకు నాలుగు నెలలనుంచి వేతనాలు రావడంలే దు. సోమార్‌పేట్, ఫరీద్‌పేట్, లచ్చంపేట్ తదితర సబ్‌స్టేషన్‌లలో ఆరు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇంకా అందని కరువు భత్యం
కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్లలోని సబ్‌స్టేషన్‌ల ఆపరేటర్లకు 2014 నుంచి కరువు భత్యం చెల్లించడం లేదు. ఒక్కో ఆపరేటర్‌కు రూ. 30 వేలకుపైగా రావా ల్సి ఉంది. ఈ మొత్తం కోసం ఆపరేటర్లు రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ విషయమై కాంట్రాక్టర్‌లకు ఎన్నిసార్లు విన్నవించినా.. సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
సబ్‌స్టేషన్ ఆపరేటర్లు పనులు చేసేది విద్యుత్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే. అయితే వీరికి జీతాలు మాత్రం కాంట్రాక్టర్‌లు ఇస్తారు. ప్రతి నెల ఆపరేటర్లకు వచ్చే జీతాల నుంచి అధికారులకు పర్సేంటీజీలు ఇస్తున్నామని కాంట్రాక్టర్‌లు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని సబ్‌స్టేషన్లలోనైతే అసలు వేతనాలే ఇవ్వడం లేదు. ఈ విషయమై డీఈఈలకు ఫి ర్యాదు చేసినా స్పందించడం లేదని ఆపరేటర్లు పే ర్కొంటున్నారు. ‘‘ఇష్టం ఉంటే పనిచేయండి లేకపోతే మానేయండి’’ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఇప్పించాలని కోరుతున్నారు.
సబ్‌స్టేషన్ ఆపరేటర్లకు అందని జీతాలు
Published Sat, Apr 9 2016 4:34 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
Advertisement