కరువుపై ఇంత నిర్లక్ష్యమా?
ప్రభుత్వ తీరుపై ప్రొఫెసర్ కోదండరాం మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు తీవ్రం గా ఉన్నా ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కరువులో రైతుల దుస్థితి-పంట రుణాలు అం శంపై తెలంగాణ రైతు జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్‌టే బుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలోని 38 మండలాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయగా కరువు తీవ్రంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తేలిందన్నారు. జూన్ మొదటిపక్షంలో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేశారని, ఆ తర్వాత వర్షాలు సక్రమంగా లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. అయినా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాలవారీగా సాగైన పంటలు, వాటిలో ఎండిన పంటలు, రైతులకు జరిగిన నష్టంపై పూర్తి నివేదిక తయారు చేయాలన్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు...
గతేడాది పంట నష్టానికి ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని కోదండరాం విమర్శించారు. రూ.లక్ష దాకా పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చి 4 విడతలుగా మాఫీ చేస్తామన్న సర్కారు మళ్లీ మాటమార్చిందన్నారు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందని, ప్రభుత్వం పాత రుణాలను మాఫీ చేసి, కొత్తగా బ్యాంకు రుణాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కరువు, రైతు సమస్యలపై చర్చించి ఉపశమన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే మార్గాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రైతులను ఆదుకోవాలంటూ బాపూ ఘాట్ వద్ద మౌన దీక్ష చేస్తానన్నారు.
భూసేకరణలోనూ అన్యాయం...
భూసేకరణలోనూ ప్రభుత్వం స్పష్ట త లేకుండా రైతులకు అన్యాయం చేస్తోందని కోదండరాం అన్నారు. భూములను భూసేకరణ చట్టం-2013 చట్ట ప్రకారం సేకరిస్తారో లేక జీవో123 ప్రకారం చేస్తారో స్పష్టం చేయాలన్నారు. పంట రుణాలను మాఫీ చేసి, కొత్తవి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి కోరారు. ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్, తెలంగాణ మాల మహానాడు నాయకులు భైరి రమేశ్, జేఏసీ నేత మాదు సత్యంగౌడ్, రైతు సంఘం నేతలు అంజిరెడ్డి, జగపతిరావు, సుజయ, కె.రవి పాల్గొన్నారు.